యువకుడిని ఢీకొట్టడంతో గ్రామస్థుల ఆగ్రహం
మరో 15 వాహనాలూ ధ్వంసం
-కామారెడ్డి, బిచ్కుంద: ద్విచక్రవాహనంపై రోడ్డు దాటుతున్న ఓ యువకుడిని వేగంగా వస్తున్న ఓ ఇసుక లారీ ఢీకొట్టడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వెంటనే స్థానికులు ఆగ్రహంతో ఆ వాహనానికి నిప్పంటించారు. అంతటితో ఆగక మరో 15 వాహనాలను ధ్వంసం చేశారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. బీర్కూర్, ఖద్గాం గ్రామాల పరిధి.. మంజీర నదిలోని ఇసుక క్వారీల నుంచి బిచ్కుంద మీదుగా హైదరాబాద్‌కు ఇసుకను తరలిస్తున్న లారీ ఎస్.బి.ఐ. సమీపంలో గోపన్‌పల్లికి చెందిన విజయ్(26)ను ఢీకొంది. ప్రమాదానికి ఇసుక లారీల వేగమే కారణమని భావించిన స్థానికులు మిగిలిన వాహనాలను అడ్డుకున్నారు. స్థానికులను చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించగా ఆగ్రహంతో వారిపై తిరగబడ్డారు. కొన్నిరోజులుగా ఇసుక లారీలతో ఇబ్బందులు పడుతున్నామని.. రాత్రిళ్లు తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని నిరసన వ్యక్తం చేశారు. క్షతగాత్రుడిని నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. రాత్రి ఎస్పీ శ్వేత ఘటనాస్థలిని పరిశీలించి వివరాలు తెలుసుకొన్నారు.