నేటి అర్ధరాత్రి వరకు మద్యం విక్రయాలు


నూతన సంవత్సరం సందర్భంగా అనుమతి

నేటి అర్ధరాత్రి వరకు మద్యం విక్రయాలు

 హైదరాబాద్‌: నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో గురువారం అర్ధరాత్రి 12 గంటల వరకు మద్యం దుకాణాలను తెరిచి ఉంచేందుకు అనుమతిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. బార్లలో గురువారం రాత్రి ఒంటిగంట వరకు మద్యం సరఫరా చేసేందుకు అనుమతులిచ్చారు. సాధారణంగా మద్యం దుకాణాల్లో రాత్రి 11 గంటల వరకే విక్రయాలకు అనుమతి ఉన్న సంగతి తెలిసిందే.

పర్మిట్‌రూంలు తెరుచుకోవచ్చు
మద్యం దుకాణాల పక్కన పర్మిట్‌ రూంల నిర్వహణకు ప్రభుత్వం తాజాగా అనుమతి ఇచ్చింది. కరోనా నేపథ్యంలో ఇప్పటివరకు పర్మిట్‌ రూంలను మూసివేశారు. బార్ల తరహాలో కొవిడ్‌ నిబంధనలను అనుసరిస్తూ వాటిని నిర్వహించుకునే వెసులుబాటు కల్పిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

ఈవెంట్లకు అనుమతుల్లేవు: డీజీపీ
కరోనా నేపథ్యంలో కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా ప్రత్యేకమైన ఈవెంట్ల నిర్వహణకు రాష్ట్ర వ్యాప్తంగా అనుమతుల్లేవని డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి స్పష్టంచేశారు. బార్లు, రెస్టారెంట్లు, పబ్‌, క్లబ్బుల్లాంటి ప్రదేశాల్లో సాధారణంగా జరిగే కార్యక్రమాలు జరుపుకోవచ్చన్నారు. రిసార్టులు, ఫామ్‌హౌస్‌లు, హోటళ్లలో టికెట్ల విక్రయంతో లేదా పాసుల జారీతో ఈవెంట్లు నిర్వహించేందుకు మాత్రం అనుమతులు లేవన్నారు. నియంత్రణ చర్యల్లో భాగంగా ఇప్పటికే నిఘా విస్తృతం చేసినట్టు చెప్పిన డీజీపీ నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా నిర్వహిస్తే చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు.

Post a Comment

أحدث أقدم