డ్రైఫ్రూట్స్‌ను మనందరం చాలా ఇష్టంగా తింటుంటాం. ఈ ఎండిన పండ్లలో మనకు బాగా తెలిసినవి ఎండు ద్రాక్ష, ఎండు ఖర్జూర వంటివి కొన్నే. కానీ... ఇటీవల అలాంటి డ్రైఫ్రూట్ ఎన్నెన్నో మనకు అందుబాటులోకి వస్తున్నాయి. పైగా అవి ఎన్నెన్నో వ్యాధుల నివారణకూ తోడ్పడుతున్నందువల్ల వాటిపై ఆసక్తి కూడా బాగా పెరిగింది. ఇటీవల వాటి లభ్యత కూడా బాగానే పెరిగింది. కొన్ని ఎండు పండ్లు... ఎన్నో వ్యాధుల నివారణతో బాగా మన ఆరోగ్య పరిరక్షణలో, వాటితో ఒనగూరే ప్రయోజనాలపై అవగాహన కలిగించుకునేందుకు తోడ్పడేదే ఈ కథనం.
సాధారణంగా ఆరోగ్యాన్ని కలిగించేవి కాస్తంత చేదుగానో, ఘాటుగానో, వగరుగానో ఉంటాయి. వాటిని తినడానికి మనం ఒకింత ఇబ్బంది పడుతుంటాం కూడా. కానీ ఎండిన పండ్లు మంచి రుచిగా ఉంటాయి కాబట్టి ఇష్టంగానే మనం వీటిని తింటుంటాం. అలా ఇష్టంతో, మంచి రుచితో కొన్ని జబ్బులను నివారించుకునే మార్గాలను చూద్దాం.
అలాగే ఎండిన అత్తిపండ్లు (డ్రై– ఫిగ్స్) తినడం వల్ల దీనిలోని ఐరన్, విటమిన్–సి వల్ల రక్తహీనత తగ్గడంతోపాటు వ్యాధినిరోధక శక్తి కూడా పెంపొందుతుంది. రక్తహీనత నివారణకు మాంసాహారం... ముఖ్యంగా మాంసాహారాల్లోనూ కాలేయం బాగా తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తారు. అయితే కఠినంగా శాకాహార నియమాలు పాటించేవారికి ఇది ఒకింత ఇబ్బంది కలిగించే పరిష్కారం. అలాంటివారందరూ ఎండిన ఫిగ్స్‌పై ఆధారపడవచ్చు. రక్తహీనతతో బాధపడేవారిలో మాంసాహారంలోని కాలేయం వంటివి తీసుకుంటే ఎలాంటి ఫలితాలు ఒనగూరుతాయో... ఎండిన ఫిగ్స్‌తోనూ అవే ప్రయోజనాలు చేకూరతాయి.
అధిక రక్తపోటు నివారణకు ఎండు ఆప్రికాట్: సాధారణంగా హైబీపీతో బాధపడేవారికి అరటిపండ్లు తినమని డాక్టర్లు సూచిస్తుంటారు. అరటిపండులో పుష్కలంగా ఉండే పొటాషియమ్ రక్తపోటును నివారిస్తుంది/నియంత్రిస్తుంది. అందుకే ఆ సూచన చేస్తుంటారు. అయితే ఒక అరటి పండులో కంటే ఒక ఎండిన ఏప్రికాట్‌లో మూడు రెట్లకు మించి కాస్తంత ఎక్కువగానే పొటాషియమ్ ఉంటుంది. దాంతో హైబీపీ బాగా తగ్గుతుంది. అట్లాంటాలోని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అనే సంస్థ నిర్వహించిన అధ్యయనంలో పొటాషియమ్ ఎక్కువగా తీసుకోవడం అన్నది హైబీపీ నియంత్రిస్తుందని తేలింది. (దీనికి భిన్నంగా సోడియమ్ అన్నది రక్తపోటును పెంచుతుందన్న విషయం తెలిసిందే. అందుకే రక్తపోటు పెరిగే ప్రమాదం ఉన్నందున ఉప్పు ఎక్కువగా తీసుకోవద్దంటూ డాక్టర్లు సూచిస్తుంటారు కూడా). అందుకే హైబీపీ నియంత్రణకు ఎండిన ఏప్రికాట్ మంచి రుచికరమైన మార్గం.
ఆస్టియోపోరోసిస్‌ను నివారించే రెయిసిన్స్ : ఇటీవల రకరకాల రెయిసిన్స్ (కిస్‌మిస్ లాంటివే అయినా బాగా ఎండిన మరో రకం ద్రాక్ష) మెనోపాజ్‌కు చెరుకున్న మహిళల్లో అత్యంత సాధారణంగా కనిపించే ఆస్టియోపోరోసిస్‌ను నివారిస్తాయి. వాళ్ల ఎముకలను పటిష్టం చేస్తాయి. సాధారణంగా మహిళలందరిలోనూ ఒక వయసు దాటాక ఎముకల సాంద్రత తగ్గుతుంది. (ఈ పరిణామం అందరిలోనూ కనిపించినా... మెనోపాజ్ దాటాక మహిళల్లో మరింత ఎక్కువ. అందుకే ఎముకలను పెళుసుబార్చి తేలిగ్గా విరిగేలా చేసే ఆస్టియోపోరోసిస్ వాళ్లలోనే ఎక్కువ). సాధారణంగా పాలు, పాల ఉత్పాదనల్లో కాల్షియమ్ ఎక్కువ. అందుకే పెరుగులో కొన్ని రెయిసిన్స్ ముక్కలతో పాటు మన దగ్గర ఇటీవలే లభ్యత పెరిగిన ‘పెకాన్స్’ వంటి ఎండుఫలాలను కలిపి తీసుకుంటే మరింత మంచి ప్రయోజనం కనిపిస్తుంది.
మలబద్దకాన్ని నివారించే ప్రూన్స్: ఈ ప్రూన్స్ కూడా కిస్‌మిస్, రెయిజిన్స్ లాంటి మరో రకం ఎండు ద్రాక్ష. కాకపోతే అవి నల్లటి రంగులో కిస్‌మిస్, రెయిజిన్స్ కంటే పెద్దవిగా ఉంటాయి. మనలో చాలామంది మలబద్దకంతో బాధపడుతూ ఉంటారు. ఈ సమస్యను అధిగమించడం కోసం అనేక మార్గాలు అవలంబిస్తూ ఉంటారు. కానీ వాటన్నిటికంటే రుచుకరమైనదీ, తేలికైన మార్గం ప్రూన్స్ తినడం. రోజూ అరడజను ప్రూన్స్ తినడం వల్ల మలవిసర్జన సాఫీగా జరుగుతుందని అనేక పరిశీలనల్లో తేలింది. ప్రూన్స్‌లో ఉండే సార్బిటాల్ అనే పోషక పదార్థం మలాన్ని మృదువుగా చేసి అది తేలిగ్గా విసర్జితమయ్యేలా తోడ్పడతుంది. కాబట్టి మలబద్దకం ఉన్నవారు ఈ రుచికరమైన మార్గాన్ని ఎంచుకుని ప్రయోజనం పొందవచ్చు.
గౌట్‌ను నివారించే ఎండు చెర్రీలు: ఎండు చెర్రీలలో యాంథోసయనిన్ అనే పోషకం ఉంటుంది. ఇది ఎముకల్లో మంట, నొప్పి, ఇన్‌ఫ్లమేషన్‌ను సమర్థంగా తగ్గిస్తుంది. అందుకే ఎముకల్లో తీవ్రమైన నొప్పి కలిగించే గౌట్, ఆర్థరైటిస్ వంటి సమస్యలతో బాధపడేవారు ఎండు చెర్రీలను తింటే మంచి ఉపశమనం లభిస్తుంది. కొద్దిరోజుల కిందట యూఎస్ లోని మిషిగన్ యూనివర్సిటీలో నిర్వహించిన ఒక అధ్యయనంలో ఎండు చెర్రీ పండ్లు తినేవారిలో ఎముకల్లో మంట, నొప్పి, ఇన్‌ఫ్లమేషన్ సగానికి సగం తగ్గుతాయని తేలింది.
యూరినరీ ఇన్ఫెక్షన్స నివారణకు ఎండిన క్రాన్‌బెర్రీ పండ్లు : మహిళల్లో మూత్రసంబంధిత ఇన్ఫెక్షన్లు ఎక్కువ. ఇలా మూత్ర సంబంధిత ఇన్ఫెక్షన్ల (యూరినరీ ఇన్ఫెక్షన్స్)తో బాధపడేవారు ఎండిన క్రాన్‌బెర్రీ పండ్లను తింటే మంచి ఉపశమనం కలుగుతుందని తేలింది. కొన్ని అమెరికన్ అధ్యయనాల్లో ఇది నిరూపితమైన సత్యం. అంతేకాదు క్యాన్‌బెర్రీ పండ్ల వల్ల జీర్ణసంబంధిత ఇన్ఫెక్షన్ల నుంచీ ఉపశమనం చేకూరుతుంది. ముఖ్యంగా ఈ–కోలై బ్యాక్టీరియా నుంచి కూడా ఉపశమనం కలుగుతుందని తేలింది. ఎండిన క్యాన్‌బెర్రీలలో ఉండే ప్రో–యాంథోసయనిన్ అనే పోషక పదార్థం వల్ల ఈ ప్రయోజనం ఒనగూరుతుందని స్పష్టమైంది.