అనాథాశ్రమంలో ఆకతాయిలు



ఆశ్రయం పొందిన ప్రాంతంలోనే ర్యాగింగ్ ‌కేర్‌ అండ్‌ షేర్‌లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్న వీడియోలు

అది ఒకప్పుడు తమకు ఆశ్రయం కల్పించిన ఆశ్రమం. పవిత్రమైన ఆ ప్రాంతంలోనే ర్యాగింగ్‌కు పాల్పడ్డారు ఆ యువకులు. పంతాలకు పోయి ఒకరినొకరు అవమానించుకున్నారు. ఆశ్రమ ప్రతిష్ఠను దిగజార్చారు. గన్నవరం మండలం బుద్ధవరంలోని కేర్‌ అండ్‌ షేర్‌ ఆశ్రమంలో వెలుగుచూసిన ఈ ర్యాగింగ్‌ ఘటన వీడియోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

విజయవాడ/గన్నవరం, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి) : గన్నవరం మండలం బుద్ధవరం గ్రామంలో ఉన్న కేర్‌ అండ్‌ షేర్‌ ఆశ్రమంలో ఇటీవల జరిగిన ఓ ర్యాగింగ్‌ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సామాజిక మాధ్యమాల్లో ఆ వీడియోలు ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి. వివిధ కారణాల రీత్యా అనేక ప్రాంతాలకు చెందిన అబ్బాయిలు, అమ్మాయిలు కేర్‌ అండ్‌ షేర్‌లో ఆశ్రయం పొందుతుంటారు. ఇక్కడే చదువుకుని బయటకు వెళ్లిన వారంతా (పూర్వ విద్యార్థులు) ఏటా క్రిస్మస్‌కు కలుసుకుంటారు. రెండు రోజుల ముందే వచ్చి అన్ని పనులూ చూసుకుంటారు.  ఈ 25వ తేదీన కూడా అందరూ కలుసుకుని క్రిస్మస్‌ కేక్‌ కట్‌ చేసుకున్నారు. ఆ రోజే ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుకున్నారు. 

పంతాలకు పోయి..

ఇందులో యశ్వంత్‌ అనే పూర్వ విద్యార్థి హైదరాబాద్‌ నుంచి రాగా, వాసు అనే పూర్వ విద్యార్థి విజయవాడ నుంచి వెళ్లాడు. వారిలో యశ్వంత్‌కు వాసు జూనియర్‌. ఆత్మీయ సమ్మేళనానికి వచ్చిన వాసు అక్కడ చదువుతున్న విద్యార్థినులను టీజ్‌ చేశాడు. ఈ విషయాన్ని గమనించిన యశ్వంత్‌ అతడికి వార్నింగ్‌ ఇచ్చాడు. పంతానికి పోయిన వాసు.. యశ్వంత్‌ను నోటికొచ్చినట్టు తిడుతూ తన స్నేహితులకు వాట్సాప్‌ ద్వారా ఓ వాయిస్‌ మెసేజ్‌ పంపాడు. ఇది యశ్వంత్‌ వద్దకు వచ్చింది. ఆగ్రహించిన యశ్వంత్‌తో పాటు మరో ముగ్గురు యువకులు 26వ తేదీ అర్ధరాత్రి వాసుకు బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని పసిగట్టిన వాసు ఆ రోజు అర్ధరాత్రి పారిపోయి ఆశ్రమం ప్రాంగణంలో ఉన్న ఓ బురదగుంటలో పడిపోయాడు. అదిచూసిన యశ్వంత్‌ గ్యాంగ్‌ వాసును బయటకు లాక్కొచ్చి దుస్తులు విప్పించారు. యశ్వంత్‌ కర్రతో కొడుతుండగా, మిగిలిన యువకులు సెల్‌ఫోన్లలో వీడియోలు, ఫొటోలు తీశారు. కొంతమంది ఒంటిపై దుస్తులు లేని వాసుతో సెల్ఫీలు దిగారు. కేర్‌ అండ్‌ షేర్‌ విద్యార్థులు, మాజీ విద్యార్థుల విషయంలో ఏం జరిగినా తాను ఎంట్రీ ఇస్తానని వాసును యశ్వంత్‌ బెదిరించాడు. ఈ మాటలు వీడియోల్లో రికార్డయ్యాయి. వాసు అండర్‌వేర్‌తో ఉన్న ఫొటోలను అందరికీ పంపుతామని చెప్పి బెదిరించి వెళ్లిపోయాడు. 27వ తేదీ పూర్వ విద్యార్థులంతా ఎవరి ప్రాంతాలకు వారు వెళ్లిపోయారు. ఈ ఘటన ఈనెల 26న జరిగినప్పటికీ తాజాగా ఆ వీడియోలు, ఫొటోలు వాట్సాప్‌ల్లో హల్‌చల్‌ చేస్తున్నాయి. ఘటనపై గన్నవరం పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు. కేర్‌ అండ్‌ షేర్‌ ప్రతినిధులు మాత్రం పోలీస్‌ కమిషనర్‌ శ్రీనివాసులును కలిసి ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. 

Post a Comment

أحدث أقدم