తను నా భర్త.. కాదు నా భర్త

ఒక్కడి కోసం కొట్టుకున్న ఇద్దరు మహిళలు

డెహ్రడూన్‌: ఉత్తరాఖండ్‌లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఒక్క వ్యక్తి కోసం ఇద్దరు మహిళలు గొడవపడ్డారు. నా భర్తంటే.. నా భర్తంటూ వాదించుకున్నారు. చివరకు పోలీసులు రావడంతో కథలో అసలు ట్విస్ట్‌ బయటకు వచ్చింది. అంతసేపు మిన్నకుండిన సదరు మగానుభావుడు మొదటి భార్యకు తెలియకుండా రెండో స్త్రీని వివాహం చేసుకున్నానని వెల్లడించాడు. దాంతో పోలీసులు వారికి కౌన్సిలింగ్‌ ఇచ్చి పంపించారు. వివరాలు..  రూర్కీలోని గంగ్నహర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వెస్ట్ అంబర్ తలాబ్ నివాసి అయిన మహిళకు సదరు వ్యక్తితో పది సంవత్సరాల క్రితం వివాహం అయ్యింది. నలుగురు కుమార్తెలు కూడా ఉన్నారు. అయితే నాలుగేళ్ల నుంచి సదరు వ్యక్తి మరో స్త్రీతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే భార్య చెల్లెలితోనే అతడు రిలేషన్‌లో ఉన్నాడు. దీని గురించి సదరు వ్యక్తి భార్యకు తెలియదు. ఈ క్రమంలో నాలుగు నెలల క్రితం భార్యభర్తలకు వివాహేతర సంబంధం విషయంపై గొడవ జరగడంతో ఆమె పుట్టింటికి వెళ్లింది. ఇక అతడు కూడా తన మరదలిని తీసుకుని మీరట్‌ వెళ్లి అక్కడ ఓ గది అద్దెకు తీసుకుని కాపురం పెట్టాడు. దాంతో మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఇదిలా ఉండగా గత శుక్రవారం సదరు వ్యక్తి మొదటి భార్య రూర్కి బస్టాండ్‌లో తన భర్త, చెల్లి కలిసి ఉండటం చూసి.. వెళ్లి గొడవపడింది. తన భర్తతో ఎందుకు ఉన్నావని ప్రశ్నించింది. అందుకు ఆమె సోదరి అతడు తన భర్తని తెలిపింది. ఇక వీరు ఇలా గొడవపడుతుండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి ముగ్గురిని స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఇక విచారణలో సదరు వ్యక్తి కొన్ని రోజుల క్రితమే మరదలిని పెళ్లి చేసుకున్నట్లు తెలిపాడు. ఇక అతడి మీద మీరట్‌లో కేసు నమోదు చేయడంతో పోలీసులు దీని గురించి వారికి సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత ముగ్గురికి కౌన్సిలింగ్‌ ఇచ్చి ఇంటికి పంపించారు. 

Post a Comment

أحدث أقدم