యూకే రిటర్న్స్‌: కర్ణాటకలో 14, కేరళలో 8మందికి


యూకే రిటర్న్స్‌: కర్ణాటకలో 14, కేరళలో 8మందికి

దిల్లీ: యూకే నుంచి భారత్‌కు వచ్చిన ప్రయాణికుల్లో కరోనా పాజిటివ్‌ల సంఖ్య నానాటికీ పెరుగుతుండటం కలవరపెడుతోంది. ఇప్పటికే యూకే నుంచి వచ్చిన పలువురికి కొవిడ్‌ నిర్ధారణ కావడంతో వారిని ఆయా రాష్ట్రాల్లో ప్రత్యేకంగా సంస్థాగత క్వారంటైన్‌లో ఉంచారు. తాజాగా యూకే నుంచి వచ్చిన 14 మంది కర్ణాటకవాసులకు, కేరళకు వచ్చిన 8 మందికి కరోనా సోకినట్లు తేలింది. అంతకుముందు భువనేశ్వర్‌లో బ్రిటన్‌ నుంచి తిరిగొచ్చిన నాలుగేళ్ల చిన్నారికి కూడా వైరస్‌ సంక్రమించినట్లు గుర్తించారు.

ఇటీవల బ్రిటన్‌ నుంచి మొత్తం 2,500 మంది రాష్ట్రానికి తిరిగొచ్చినట్లు గుర్తించామని కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి కె.సుధాకర్‌ తెలిపారు. వీరిలో ఇప్పటికే 1,638 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 14 మందికి పాజిటివ్‌గా తేలిందన్నారు. వీరికి సోకింది కొత్త రకం వైరసా? కాదా? అన్నది తేల్చేందుకు నమూనాలను పుణెలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీకి పంపామని వెల్లడించారు. వీటి ఫలితాలు 48 గంటల్లో రానున్నాయని తెలిపారు.  

ఇక యూకే నుంచి కేరళకు వచ్చిన 8 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి కె.కె.శైలజ వెల్లడించారు. వీరి నమూనాల్ని కూడా పుణెలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ వైరాలజీకి పంపారు. ప్రస్తుతం వీరంతా క్వారంటైన్‌లో ఉన్నారు. తాజా పరిణామంతో కేరళ అధికార యంత్రాంగం మరింత అప్రమత్తమైంది. కరోనా నిర్ధారణ పరీక్షల్ని మరింత పకడ్బంధీగా చేపట్టాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని నాలుగు అంతర్జాతీయ విమానాశ్రయాల్లో నిఘాను బలోపేతం చేశారు. కేరళలో ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. దీంతో కొవిడ్‌ వ్యాప్తి విశ్వరూపం దాల్చే ప్రమాదం ఉందని అంతా భావించారు. కానీ, అలా జరగలేదు. పైగా మరణాల రేటు తగ్గుముఖం పట్టింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పటిష్ఠ కార్యక్రమాల వల్లే ఇది సాధ్యమైందని మంత్రి శైలజ తెలిపారు.

బ్రిటన్‌లో ఇటీవల రూపాంతరం చెందిన కరోనా వైరస్‌ బయటపడటంతో ప్రపంచ దేశాలన్నీ అప్రమత్తమయ్యాయి. భారత్‌ సహా పలు దేశాలు యూకేకు విమాన సర్వీసులు నిలిపివేశాయి. భారత్‌లో ఈ నెల 23 నుంచి 31 వరకు యూకేకు విమానాల రాకపోకలను తాత్కలికంగా రద్దు చేశారు. అయితే 23 అర్ధరాత్రిలోగా భారత్‌కు చేరుకున్నవారికి ఎయిర్‌పోర్టుల్లోనే కరోనా పరీక్షలు చేశారు. వీరిలో కొందరికి పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఆయా ప్రయాణికులను సంస్థాగత క్వారంటైన్‌లో ఉంచారు. మరోవైపు కొత్త రకంపై రాష్ట్రాలు కూడా అప్రమత్తమయ్యాయి. గత రెండువారాల్లో యూకే నుంచి వచ్చిన, యూకే మీదుగా ప్రయాణాలు చేసిన వారిని గుర్తించి వారికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు.

Post a Comment

Previous Post Next Post