ANWtv: 4 ఏళ్ల కుమారుడ్ని హత్య చేసిన బెంగుళూర్ మహిళ

బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరుకు చెందిన ఏఐ కంపెనీ సీఈవో సుచనా సేథ్ (Bengaluru CEO Suchana Seth) తన కుమారుడ్ని చంపే ముందు భర్తకు మెసేజ్‌ పంపినట్లు తెలిసింది. గోవాలోని స్టే అపార్ట్‌మెంట్‌లో 4 ఏళ్ల కుమారుడ్ని హత్య చేసినట్లు ఆమె ఆరోపణలు ఎదుర్కొంటున్నది. జనవరి 7న ఆదివారం బెంగళూరులో కుమారుడ్ని కలుసుకోవాలంటూ విడిపోయిన భర్త వెంకట్రామన్‌కు ఆమె ముందుగా మెసేజ్‌ పంపింది. ఆ సమయంలో బెంగళూరులో ఉన్న వెంకట్రామన్‌ ఓకే అంటూ సుచనాకు రిప్లై ఇచ్చాడు. కుమారుడితో కలిసి వస్తానని ఆమె చెప్పిన ప్రాంతానికి అతడు చేరుకున్నాడు. అక్కడ సుమారు రెండు గంటలపాటు ఎదురుచూశాడు. సుచనా రాకపోవడంతో ఆమెకు ఫోన్‌ చేయడంతోపాటు మెసేజ్‌లు పంపాడు. ఆమె నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో పని నిమిత్తం ఇండోషినియా రాజధాని జకర్తా వెళ్లిపోయినట్లు తెలిసింది.కాగా, జనవరి 6 నుంచి 10 వరకు గోవా రాజధాని పనాజీలోని స్టే అపార్ట్‌మెంట్‌లో బస చేసేందుకు సుచనా సేథ్ బుక్‌ చేసుకుంది. అయితే జవనరి 7న సాయంత్రం ఉన్నట్టుండి ఖాళీ చేసింది. క్యాబ్‌ బుక్‌ చేసుకుని అర్జెంట్‌గా ఒంటరిగా సూట్‌కేసుతో బెంగళూరు బయలుదేరింది.  అయితే ట్రాఫిక్ జామ్‌ కావడంతో అర్జెంట్‌ పని ఉంటే ఎయిర్‌పోర్ట్‌లో డ్రాప్‌ చేస్తానని క్యాబ్‌ డ్రైవర్‌ సూచించాడు. ఆలస్యమైనప్పటికీ క్యాబ్‌లోనే బెంగళూరు వెళ్తానని ఆమె చెప్పింది.

మరోవైపు సుచనా బస చేసిన రూమ్‌లో రక్తం మరకలు ఉండటం, ఆమె ఒంటరిగా వెళ్లడాన్ని సిబ్బంది గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో క్యాబ్‌లో వెళ్తున్న సుచనాతో గోవా పోలీసులు మాట్లాడారు. ఆమె కుమారుడి గురించి ఆరా తీయగా తన బంధువుల వద్ద ఉంచినట్లు చెప్పింది. అనుమానించిన పోలీసులు క్యాబ్‌ డ్రైవర్‌తో మాట్లాడారు. సమీపంలోని పోలీస్‌ స్టేషన్‌కు ఆమెను తీసుకెళ్లాలని చెప్పారు.కగా, క్యాబ్‌ అప్పటికే కర్ణాటకలోకి ప్రవేశించడంతో ఆ ప్రాంతంలోని పోలీస్‌ స్టేషన్‌ వద్దకు డ్రైవర్‌ తీసుకెళ్లాడు. పోలీసులు సుచనా సూట్‌కేస్‌ను తనిఖీ చేయగా అందులో కుమారుడి మృతదేహం కనిపించింది. అయితే తన కుమారుడ్ని తాను చంపలేదని, ఉదయం నిద్ర లేచేటప్పటికే కుమారుడు మరణించి ఉన్నట్లు పోలీసులకు చెప్పింది. అయితే కుమారుడు భర్త పోలికలతో ఉండటంతో ఎక్కువ మోతాదులో దగ్గు మందు ఇచ్చి, ఊపిరాడకుండా చేసి హత్య చేసి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.


Post a Comment

Previous Post Next Post