రంగారెడ్డి: నార్సింగిలో జరిగిన దారుణ ఘటనపై స్థానికులు రగిలిపోతున్నారు. పెట్రోల్ బంక్‌లో పని చేసే కార్మికులపై ముగ్గురు యువకులు దాడి చేసి..
అకారణంగా ఒకరిని పొట్టనబెట్టుకున్నారు. అయితే దాడికి పాల్పడిన దుండగలకు నేర చరిత్ర ఉన్నట్లు ఇప్పుడు నిర్ధారణ అయ్యింది. మరోవైపు సంజయ్ మృతికి కారణమైన వాళ్లను కఠినంగా శిక్షించాలని అతని గ్రామస్తులు ధర్నా చేపట్టారు.
ఏం జరిగిందంటే.. అర్ధరాత్రి 12 గంటలకు జన్వాడలోని ఓ పెట్రోల్ పంప్ వద్దకు కారులో ముగ్గురు యువకులు చేరుకున్నారు. అయితే.. సమయం దాటిపోవడం, పైగా వాళ్లు మద్యం మత్తులో ఉండడంతో పెట్రోల్ లేదని చెప్పారు కార్మికులు. అయితే.. తాము చాలా దూరం వెళ్లాలని ఆ యువకులు బతిమాలారు. దీంతో.. పెట్రోల్ పోశారు కార్మికులు. ఆపై వాళ్లు కార్డు పని చేయట్లేదని యువకులు బుకాయించారు. దీంతో.. క్యాష్ ఇవ్వమని సిబ్బంది కోరడంతో గొడవకు దిగారు.
మాకే ఎదురు మాట్లాడుతారా? అంటూ ఆ మగ్గురు రెచ్చిపోయి బంక్ క్యాషియర్‌పై దాడికి దిగారు. అక్కడే పని చేసే సంజయ్ అది గమనించి.. వాళ్లను అడ్డుకోబోయాడు. దీంతో సంజయ్‌పై పిడిగుద్దులు కురిపించడంతో అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణం విడిచాడు. అది చూసి యువకులు పారిపోగా.. సంజయ్‌ను ఆస్పత్రికి తరలించినప్పటికీ లాభం లేకుండా పోయింది. పెట్రోల్ బంక్‌లో అమర్చిన సీసీ కెమెరాలో దాడికి సంబంధించిన దృశ్యాలు నమోదు అయ్యాయి.
కేసు నమోదు.. వెతుకులాట
ఇదిలా ఉంటే.. సంజయ్ మృతికి కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలని జన్వాడ గ్రామస్తులు ధర్నాకు దిగారు. రోడ్డుపై రాస్తారోకో నిర్వహించి.. ట్రాఫిక్‌ను అడ్డుకున్నారు. జోక్యం చేసుకున్న పోలీసులు న్యాయం జరిపిస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు ఉత్తపుణ్యానికే సంజయ్ ప్రాణం పోవడంతో అతని కుటుంబం విషాదంలో కూరుకుపోయింది.
మరోవైపు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు నార్సింగి పోలీసులు. నిందితులను జన్వాడ గ్రామానికి చెందిన నరేందర్, మల్లేష్, అనూక్‌గా గుర్తించారు. ప్రస్తుతం వాళ్లను పట్టుకునే యత్నంలో ఉన్నారు. ఇక నిందితులు నిందితులు అనూప్, నరేందర్, మల్లేష్ పై నార్సింగిలో పలు కేసులు నమోదు అయ్యాయి. అత్యాచారంతో పాటు దొంగతనం కేసుల్లో ప్రధాన నిందితులుగా ఉన్నారు ఈ కంత్రీగాళ్లు. గత నెలలో స్థానికంగా ఓ విలేకరిపైనా దాడి చేశారు వీళ్లు.