హైదరాబాద్: గతంలో నామినేషన్ అంటూ సీక్రెట్ రూమ్‌కు లోబోను పంపిన బిగ్‌బాస్.. తాజాగా జెస్సీని పంపాడు. హౌస్‌లో ఉన్న జెస్సీ గత కొన్ని రోజులుగా వర్టికో సమస్యతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో వైద్యుడితో మాట్లాడటం.. విశ్రాంతి అవసరమని ఆయన సూచించడంతో హౌస్‌నుంచి బయటకు రావాల్సిందిగా బిగ్‌బాస్ జెస్సీకి సూచించాడు. ఈ విషయం తెలిసిన అతని స్నేహితులు సిరి, షణ్ముఖ్‌లు బాధపడ్డారు. సన్నీ, మానస్, ప్రియాంకలు కూడా తనని బాగా చూసుకున్నారని జెస్సీ చెప్పాడు.
‘నాకు మంచి హెల్త్ చెకప్ చేయించారు.. నాకు ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది లేదు.. నా ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది. నేను ఇంకా గేమ్‌లోనే ఉన్నాను.. సీక్రెట్ రూంలో పెట్టినందుకు చాలా థాంక్స్ బిగ్ బాస్’ అని చెప్పాడు జెస్సీ. బయటకు వెళ్లి రావడంతో క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా బిగ్‌బాస్ జెస్సీకి సూచించాడు.
ప్రియాంకకు మానస్ క్లాస్... ఆమె ముద్దులు
నామినేషన్స్ ఎఫెక్ట్‌తో ప్రియాంకతో మానస్ సరిగా మాట్లాడలేదు. ఆమె మానస్‌తో మాట్లాడేందుకు ప్రయత్నించగా అతడు సరిగా స్పందించలేదు. దీంతో ప్రియాంక తెగ బాధపడిపోయింది. ఇదే విషయమై కాజల్‌తో చర్చ జరగ్గా ‘నువ్వు తనకోసం వచ్చావా? మనం గేమ్ ఆడటానికి వచ్చాం, మానసే నేరుగా వచ్చి మాట్లాడేదాకా వెయిట్ చెయ్.. లేదంటే వదిలెయ్’ అని సలహా ఇచ్చింది. ఆ తర్వాత అలిగి కూర్చొన్న మానస్ దగ్గరకు భోజనం ప్లేట్ పట్టుకుని వెళ్లి.. ‘ముద్దు కావాలా? ముద్ద కావాలా’ అని అడిగింది. దీంతో మానస్ ‘ముద్దే కావాలి’ అన్నాడు. అంతే, ప్రియాంక తనకు దొరికిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పండగ చేసుకుంది.