కర్నూలు : కలెక్టరేట్‌లో రెవెన్యూ పాలన గాడితప్పింది. ముడుపులు చెల్లిస్తేనే దస్త్రం కదిలే పరిస్థితి నెలకొంది. బాధితులకు పరిహారం అందించాల్సిన విభాగంలో నిర్లక్ష్యం ఊడలై పేరుకుపోయింది. కొలువు కోసం దరఖాస్తు చేసుకున్న ఓ యువతి చరవాణి నంబరు సేకరించి ‘కొలువు కావాలంటే నువ్వురావాలంటూ’ లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.
వేధింపులు కొత్తేమీ కాదు
గతంలో ఓ రెవెన్యూ అధికారి మహిళా ఉద్యోగినులపై అసభ్యకరంగా ప్రవర్తిస్తే.. ప్రస్తుతం అదే రెవెన్యూశాఖలో తహసీల్దార్ స్థాయి అధికారి అదే బాటలో వెళ్తున్నట్లు ఆరోపణలున్నాయి. వివిధ విభాగాల్లో పనిచేస్తున్న కొందరు మహిళా ఉద్యోగినులను లైంగికంగా వేధిస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ అధికారి వ్యవహార శైలితో కొందరు సెలవులో వెళ్తుండగా మరికొందరు ఇతర విభాగాల్లోకి బదిలీపై వెళుతున్నారు.
ఆధారాలతో కలెక్టర్‌కు ఫిర్యాదు
‘‘ మా గ్రామంలో ఐదేళ్లుగా అంగన్వాడీ టీచర్ పోస్టు ఖాళీగా ఉంది.. నేను అర్హురాలిని..ఉద్యోగం ఇప్పించాలంటూ ’’ ఓ యువతి జిల్లా కేంద్రంలో గత సోమవారం ‘స్పందన’లో జిల్లా సర్వోన్నతాధికారికి విన్నవించారు. అర్జీ ఇవ్వడానికి ముందు అంతర్జాలంలో నమోదు చేసే క్రమంలో ఫోను, ఆధార్ నంబర్లు ఇవ్వాల్సి ఉంటుంది. అక్కడ విధులు నిర్వహిస్తున్న కలెక్టరేట్ ఎల్‌ఆర్-ఏవో కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ యువతి చరవాణి నంబరు తీసుకొన్నారు. అదే రోజు చరవాణిలో మాట్లాడుతూ తన హోదా చెబుతూ.. కొలువు కావాలంటే గతంలో పనిచేసి పదవీ విరమణ పొందిన ఓ ఉన్నతాధికారిని కలిస్తే పని పూర్తవుతుందన్నారు. డబ్బులతో పని కాదు.. నువ్వే ఆ అధికారి వద్దకు వెళ్లాల్సి ఉంటుంది.. అప్పుడే ఉద్యోగం పొందొచ్చని గాలం వేసేందుకు ప్రయత్నించాడు. అప్రమత్తమైన ఆ యువతి.. సదరు ఉద్యోగి మాట్లాడిన సంభాషణను రికార్డు చేసి మరుసటి రోజు జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరరావును కలిసి ఫోన్ సంభాషణ వినిపించారు.
బయటకు పొక్కకుండా జాగ్రత్త
యువతి ఫిర్యాదును స్వీకరించిన కలెక్టర్ విచారణ చేయాల్సిందిగా డీఆర్వోను ఆదేశించారు. వేధింపులకు పాల్పడిన జూనియర్ అసిస్టెంట్ తిరుమల్‌పై సస్పెన్షన్ వేటు వేశారు. ఇందులో మరో ఇద్దరి ప్రమేయం ఉన్నట్లు విచారణలో తేలింది. డీఆర్వో సీసీలుగా పనిచేస్తున్న ఒక డిప్యూటీ తహసీల్దార్, ఒక ఆర్‌ఐ స్థాయి ఉద్యోగులిద్దరిని వారి డిప్యుటేషన్ రద్దు చేసి పాతస్థానాలకు గుట్టుచప్పుడు కాకుండా బదిలీ చేశారు. యువతి విషయంలో జరిగిన హైడ్రామాను బయటకు పొక్కకుండా రెవెన్యూ అధికారులు జాగ్రత్త పడుతున్నారు.
విభాగాల్లో నిర్లక్ష్యం వీడక
ఎస్సీ, ఎస్టీ బాధిత కుటుంబాలకు పరిహారం ఇచ్చే విషయంలో సి-సెక్షన్‌లో పనిచేస్తున్న ఓ ఉద్యోగి తీవ్ర జాప్యం చేస్తున్నారు. ముడుపులివ్వనిదే దస్త్రాలు కదపడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి తార్కాణమే ఈ నెల 23న కలెక్టరేట్ గాంధీ విగ్రహం వద్ద ఎస్సీ,ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు ధర్నా చేయడం... సి-సెక్షనులో పనిచేస్తున్న మనోహర్‌ను ఆ విభాగం నుంచి తప్పించాలని.. ఆయన ఆస్తులపై విజిలెన్స్ విచారణ చేపట్టాలని ఫ్లకార్డులతో నిరసన తెలిపారు. ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ సెక్షన్‌కు సంబంధించిన బాధితులను వేధిస్తూ తన బినామీ ద్వారా భారీగా వసూళ్లకు పాల్పడుతున్నట్లు డీఆర్వోకు వినతి పత్రం ఇచ్చారు.