కరోనాని ఓడించడం మన చేతుల్లోనే..!

కొవిడ్‌ని జయిద్దాం.. భారత్‌ను గెలిపిద్దాం!

‘కరోనాని ఓడించడం మన చేతుల్లోనే..!’

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా సెకండ్‌ వేవ్‌ భారత్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. గతేడాదితో పోలిస్తే ఈ వైరస్‌ వాయు వేగంతో వ్యాపిస్తుండటంతో భారీ సంఖ్యలో కొత్త కేసులు, మరణాలు వెలుగుచూస్తున్నాయి. దీంతో దేశంలో ఎన్నడూలేనంతగా సంక్షోభ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆస్పత్రుల్లో పడకల్లేవ్‌.. ఆక్సిజన్‌ సిలిండర్లు అందుబాటులో లేవు.. చివరకు శ్మశాన వాటికల్లో అంతిమ సంస్కారాలకు సైతం చోటు దొరకని దుస్థితి అందరినీ కలచివేస్తోంది. ఇలాంటి సంక్షోభ పరిస్థితులను సృష్టించిన కరోనా మహమ్మారిని తరిమికొట్టడంలో ప్రభుత్వ చర్యలతో పాటు ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకోవడమే కీలకమంటున్నారు శాస్త్రవేత్తలు, ఆరోగ్యరంగ నిపుణులు. అప్రమత్తతతో తగిన జాగ్రత్తలు తీసుకుంటే వైరస్‌పై పోరాటంలో జయం మనదేనంటున్నారు. 

‘కరోనాని ఓడించడం మన చేతుల్లోనే..!’ 


మాస్క్‌ మరవకండి

కరోనాపై పోరాటంలో మాస్క్‌ ధరించడమే తొలి అస్త్రం. కరోనా అలజడి మొదలైనప్పట్నుంచి ప్రతి ఒక్కరూ చెబుతున్న మాట ఇదే. కానీ, ఆచరణలో చిత్తశుద్ధి లోపించడంతో తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితులు తలెత్తాయి. ప్రజలు రోజంతా మాస్క్‌లు పెట్టుకొని ఉండటం ద్వారా కరోనా వైరస్‌ గొలుసును కొన్ని వారాల్లోనే ఛేదించవచ్చని ఎపిడమాలజిస్టులు చెబుతున్నారు. సెకండ్‌ వేవ్‌లో కొవిడ్‌ విజృంభణ దృష్ట్యా ఇంట్లో ఉన్నా సరే ప్రజలు మాస్క్‌లు ధరించాల్సిన సమయం వచ్చిందని  నీతి ఆయోగ్‌ సభ్యుడు (ఆరోగ్యం) డాక్టర్‌ వీకే పాల్‌ హెచ్చరిస్తున్నారు. ఈ వైరస్‌ బారిన పడినవారిలో ఎక్కువ మందిలో లక్షణాలు బయటపడకపోవడం ఆందోళనకరం. ఇలాంటి పరిస్థితుల్లో మాస్క్‌ ధరించడం ద్వారానే ఒకరి నుంచి మరొకరికి వైరస్‌ వ్యాపించదు. డబుల్‌ మాస్క్‌ ధరించడం మరింత మేలు చేస్తుందని శాస్త్రవేత్తల అధ్యయనాలు సూచిస్తున్నాయి. సర్జికల్‌ మాస్క్‌, దానిపైన వస్త్రంతో తయారుచేసిన మాస్క్‌ను ధరించడం వల్ల కరోనాను సమర్థంగా ఎదుర్కోవచ్చని ఇప్పటికే పలు పరిశోధనల్లో తేలింది. కరోనాకు బ్రేకులు వేయడంలో మాస్కే శ్రీరామ రక్ష అని నిపుణులు పేర్కొంటున్నారు.

‘కరోనాని ఓడించడం మన చేతుల్లోనే..!’

టెస్ట్‌.. టెస్ట్‌..టెస్ట్‌.. ప్లీజ్‌!

కొవిడ్‌ అనుమానిత లక్షణాలు కనబడగానే వెంటనే టెస్ట్‌లు చేయించుకోవడంలో వెనకాడొద్దు. ఆలస్యం చేస్తే రిస్క్‌లో పడినట్టేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముందే మేల్కోనడం ద్వారానే ఈ వైరస్‌ ముప్పు నుంచి బయట పడొచ్చంటున్నారు. కరోనాను గుర్తించి దాని వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు టెస్టింగే ఏకైక మార్గమని నిపుణులంతా చెబుతున్నమాట. భారీ సంఖ్యలో పరీక్షలు చేయడం ద్వారా వైరస్‌ను కట్టడిచేసే వ్యూహాలు అమలు చేయడం మరింత తేలికవుతుంది. అంతేకాదు.. కరోనా తీవ్ర లక్షణాలతో ఆస్పత్రికి వెళ్తున్న రోగులను అడ్మిట్‌ చేసుకొనే ముందు కొవిడ్‌ రిపోర్టులు అడుగుతున్నారు. అప్పటికే టెస్ట్‌లు చేయించుకోకపోవడం వల్ల వారి ప్రాణాలను కాపాడుకోవాల్సిన కీలక సమయం వృథా అవుతోంది. దీంతో కొందరు ప్రాణాలు కోల్పోతున్న ఉదంతాలూ ఉన్నాయి. అందువల్ల అనుమానం వస్తే టెస్ట్‌ చేయించుకోవడమే ఉత్తమం. కొవిడ్ టెస్ట్‌ ఫలితం కోసం వేచి చూడకుండా ఐసోలేట్‌ కావాలి.


స్వల్ప లక్షణాలు, అసలు లక్షణాలే లేని వారు సైతం పరీక్షలు చేయించుకోవడం ద్వారా వారి కుటుంబ సభ్యులు, బంధువులు ఈ వైరస్‌ బారిన పడకుండా మేలుచేస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా భారీ సంఖ్యలో పరీక్షలు చేయించుకోవాలని చెబుతున్నాయి. మరోవైపు, దేశంలో కొవిడ్‌ టెస్టులు పెద్ద సమస్యగా మారింది. రోగుల సంఖ్య భారీగా పెరుగుతుండటంతో టెస్టింగ్‌ కిట్లతో పాటు శాంపిల్స్‌ సేకరించే సిబ్బంది, ల్యాబ్‌ టెక్నీషియన్ల కొరత వేధిస్తుండటంతో మరింత ఆందోళనకర పరిస్థితి నెలకొంది. శాంపిల్‌ సేకరించే కేంద్రాల వద్ద భారీ లైన్లు దర్శనమిస్తున్నాయి. అనేక రాష్ట్రాల్లో కొవిడ్‌ టెస్ట్‌ రిపోర్టు రావాలంటేనే కొన్ని రోజుల పాటు నిరీక్షించాల్సిన దుస్థితి నెలకొంది. అత్యధికంగా కరోనా కేసులు వెలుగుచూస్తున్న దిల్లీ, ముంబయి, బెంగళూరు వంటిచోట్ల కూడా ఇంటికి వెళ్లి స్వాబ్‌ సేకరించడం కష్టతరంగా మారింది. 

‘కరోనాని ఓడించడం మన చేతుల్లోనే..!’

వ్యాక్సినే బ్రహ్మాస్త్రం..

కరోనాపై యుద్ధంలో టీకాయే బ్రహ్మాస్త్రం‌. టీకా వేసుకోవడం ద్వారా ప్రాణ నష్టాన్ని తగ్గించవచ్చని ఇప్పటికే అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. టీకా వేసుకున్న తర్వాత కరోనా పాజిటివ్‌గా వస్తున్నప్పటికీ తీవ్రత తక్కువగా ఉంటోంది. అందుకే వైద్యరంగ నిపుణులతో పాటు ప్రభుత్వాలు కూడా పెద్ద ఎత్తున టీకాలు వేయించుకోవాలని ప్రజలకు పదే పదే విజ్ఞప్తి చేస్తున్నాయి. టీకా వేసుకుంటే కరోనా రాదనే భరోసా లేనప్పటికీ ఆస్పత్రిపాలయ్యే అవకాశాలు మాత్రం తక్కువ. ఇప్పటికే దేశ వ్యాప్తంగా కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌ టీకాల పంపిణీ పెద్ద ఎత్తున జరుగుతోంది. ఇటీవల స్పుత్నిక్‌ వీ టీకాకు భారత ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇంకా పంపిణీ ప్రారంభం కావాల్సి ఉంది. కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌ ఈ రెండూ కరోనా తీవ్రత నుంచి కాపాడటంలో సమర్థంగా పని చేస్తున్నాయి.

‘కరోనాని ఓడించడం మన చేతుల్లోనే..!’

రోగనిరోధక శక్తి పెంచుకోండి

మాస్క్‌ ధరించడం, భౌతికదూరం పాటించడంతో పాటు శరీరానికి తగిన పోషకాహారాన్ని తీసుకోవడం ఈ సమయంలో ఎంతో ముఖ్యం. రోగనిరోధక శక్తిని ఇనుమడింప జేసుకోవడం ద్వారా కరోనా బారినుంచి కొంత వరకు మనల్ని మనం కాపాడుకోవచ్చు. పండ్లు, ఆకుకూరలు, మాంసం వంటి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడంతో పాటు వ్యాయామం చేయడం, సరిపడా నిద్ర, ఒత్తిడిని తగ్గించుకొనే మార్గాలను అనుసరించడం మేలు చేస్తాయి. ఈ క్లిష్ట సమయంలో  ముఖ్యంగా సమతుల ఆహారం తీసుకోవడంపై దృష్టిపెట్టాలి. రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్‌ ఎ,బి,సి,డి,ఈ, జింక్‌ వంటి విటమిన్‌లు కలిగిన ఆహారం తీసుకోవడం ద్వారా వైరస్‌ ముప్పును తగ్గించుకోవచ్చు. 

‘కరోనాని ఓడించడం మన చేతుల్లోనే..!’

అత్యవసరమైతే తప్ప బయటకెళ్లొద్దు..

కరోనా విలయంతో హృదయవిదారక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఒక మనిషి మరో మనిషి దగ్గరకు వెళ్లాలంటేనే అనుమానం వెంటాడుతోంది. అత్యవసరమైతే తప్ప అనవసరంగా బయటకు వెళ్లొద్దు. పెళ్లిళ్లు, బర్త్‌డే పార్టీలు, ఇతర వేడుకలకు దూరంగా ఉండండి. మీ స్నేహితులు, బంధువుల బాగోగులను ఫోన్‌లో తెలుసుకోండి. భయంతో వణుకుతూ బంధాల్ని దూరం చేసుకోవద్దు. మార్కెట్‌కు వెళ్లిన సమయంలో డబుల్‌ మాస్క్‌ పెట్టుకొని వెళ్లండి. ఇంటికి వచ్చాక కూరగాయలను శుభ్రంగా కడిగి వాడండి. ఇంటికి అవసరమయ్యే సరకుల కోసం ప్రతిసారీ తిరగే అవకాశం లేకుండా 15 రోజులు/ నెలకు సరిపడా తెచ్చి ఇంట్లో పెట్టుకోండి. ఈ సంక్షోభ సమయంలో కొన్నాళ్ల పాటు ఇలాంటి ముందు జాగ్రత్తలు పాటించడం ద్వారా కరోనా మహమ్మారిపై విజయం సాధించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

Post a Comment

Previous Post Next Post