మీ కాళ్లు మొక్కుతా.. ఆక్సిజన్‌ తీసుకెళ్లొద్దు సర్‌



‘మీ కాళ్లు మొక్కుతా.. ఆక్సిజన్‌ తీసుకెళ్లొద్దు సర్‌’

ఆగ్రా: పెరుగుతున్న కేసులు.. ఆసుపత్రుల్లో చాలీచాలనీ పడకలు.. ప్రాణవాయువు కొరతతో అనంతవాయువుల్లో కలుస్తున్న ప్రాణాలు.. నేడు దేశంలో ఏ మూల చూసినా ఇదే దుస్థితి. కరోనా సృష్టిస్తున్న విలయతాండవంతో కేసులు నానాటికీ పెరిగి.. ఆక్సిజన్ కొరత తీవ్రమవుతోంది. దీంతో తమ ఆప్తుల ప్రాణాలు కాపాడుకునేందుకు కరోనా బాధితుల కుటుంబాలు పడుతున్న అవస్థలు అంతా ఇంతా కాదు. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ఓ వ్యక్తి తన తల్లికి కోసం ఎంతో కష్టపడి ఆక్సిజన్‌ సిలిండర్‌ సంపాదించగా.. అది పోలీసులు తీసుకెళ్తున్నారంటూ ఆవేదన చెందుతున్న వీడియో ఒకటి సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది. అయితే పోలీసులు మాత్రం తాము ఖాళీ సిలిండర్‌నే తీసుకెళ్లామని చెబుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..

ఆగ్రాకు చెందిన ఓ వ్యక్తి.. తన తల్లికి కరోనా సోకి ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది ఎదురవడంతో స్థానిక ఉపాధ్యాయ్‌ ఆసుపత్రిలో చేర్చారు. ఆక్సిజన్‌పై ఉన్న ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. అయితే, ఆ ఆసుపత్రి నుంచి ఇటీవల కొన్ని ఆక్సిజన్‌ సిలిండర్‌లను అంబులెన్స్‌లో తీసుకెళ్లేందుకు వచ్చారు. అది చూసిన ఆ వ్యక్తి వెంటనే వారి దగ్గరకు వెళ్లి.. ‘‘మా అమ్మ చావుబతుకుల్లో ఉంది. ఆక్సిజన్‌ ఆమెకు చాలా అవసరం. దయచేసి వాటిని తీసుకెళ్లొద్దు. మీ కాళ్లు పట్టుకుంటా’’ అంటూ పోలీసులను అభ్యర్థించారు. ఇందుకు సంబంధించిన వీడియోను యూత్‌కాంగ్రెస్‌ తమ ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేస్తూ.. ‘‘హృదయ విదారక వీడియో. పోలీసులు అమానవీయంగా ప్రవర్తిస్తున్నారు’’ అని రాసుకొచ్చింది. రాష్ట్ర పౌరుల పట్ల ఇలాగేనా వ్యవహరించేది అంటూ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై విమర్శలు గుప్పించింది.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌ అవడంతో ఆగ్రా పోలీసులు ట్విటర్‌ వేదికగా స్పందిస్తూ ఆరోపణలను ఖండించారు. తాము ఖాళీ సిలిండర్లను మాత్రమే తీసుకెళ్లామని తెలిపారు. ‘‘రెండు రోజుల క్రితం ఆగ్రాలో ఆక్సిజన్‌ కొరత ఏర్పడిన మాట వాస్తవమే. వీడియోలో కన్పిస్తున్న ఇద్దరు వ్యక్తులు ఖాళీ సిలిండర్‌ను తీసుకెళ్తున్నారు. అంతేగాక, ఆ వ్యక్తి తన తల్లి కోసం ఆక్సిజన్‌ సిలిండర్‌ ఏర్పాటు చేసేలా చూడాలని కోరాడు. అంతేగానీ, నిండుగా ఉన్న సిలిండర్లను ఎవరూ తీసుకెళ్లలేదు. తప్పుడు ప్రచారం చేసే ఇలాంటి వీడియోలను షేర్‌ చేయడాన్ని మేం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం’’ అని ఆగ్రా ఎస్పీ స్పష్టం చేసరూ.

Post a Comment

Previous Post Next Post