ఐటీ సిటీలో దంపతులు సహా ముఠా అరెస్టు రూ.7 కోట్ల నకిలీ డ్రాఫ్టులు సీజ్
బనశంకరి: నకిలీ బ్యాంకు డిమాండ్ డ్రాఫ్ట్ (డీడీ)లు తయారుచేస్తున్న నలుగురిని బెంగళూరు ఎల్రక్టానిక్ సిటీ ఉపవిభాగ బేగూరు పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.7.18 కోట్ల విలువ చేసే 25 నకిలీ డీడీలను, ముద్రణ ఉపకరణాలను సీజ్ చేశారు. నిందితులు ఇంద్రజిత్ నాయక్, ఇతడి భార్య మంజుళ, స్నేహితులు మునిరాజు, ఆనంద్.
ఫెడరల్ బ్యాంకులో రట్టు
ఇంద్రజిత్ ఒక రియాల్టీ కంపెనీ పేరుతో రూ.4.95 లక్షల నకిలీ డీడీని ముద్రించి దానిని జయరామ్ అనే వ్యక్తికి అందజేశాడు. దానిని బ్యాంకులో మార్చి నగదు తెచ్చిస్తే నీకు రూ.1.50 లక్షలు అందజేస్తానని చెప్పాడు. సరేనని జయరామ్ ఆ డీడీని ఫెడరల్ బ్యాంకులో ఇచ్చాడు. సిబ్బంది పరిశీలించగా నకిలీ డీడీ అని తెలిసింది. దీంతో జయరామ్, ఇంద్రజిత్‌నాయక్‌లపై బేగూరు పీఎస్‌లో బ్యాంకు సిబ్బంది ఫిర్యాదు చేశారు. పోలీసులు బుధవారం నిందితులను అరెస్ట్ చేసి తమదైన శైలిలో విచారణ చేపట్టారు. ఇంద్రజిత్ స్నేహితుడు మునిరాజు ఒక అసలైన డీడీని అందించి అదే తరహాలో నకిలీ డీడీలను తయారుచేయాలని సూచించాడు. తద్వారా సులభంగా డబ్బు సంపాదించవచ్చని పన్నాగం పన్నారు. ఇంద్రజిత్ ఆ డీడీని ఇంటికి తీసుకెళ్లి భార్య మంజుళతో కలిసి స్కాన్ కొన్ని నకిలీ డీడీలను తయారుచేశాడు. ఆనంద్ అనే వ్యక్తి నుంచి వివిధ బ్యాంకుల రబ్బర్ సీళ్లను సంపాదించారు. ఇంతలోనే బండారం బయటపడింది.
డీడీలు, ఉపకరణాలు సీజ్
ఇంద్రజిత్ నుంచి రూ.9 వేల నగదు, స్కానర్, ప్రింటర్, ఆరు సీళ్లు, రూ.7.18 కోట్ల విలువ చేసే 25 నకిలీ డీడీలను స్వా«దీనం చేసుకున్నారు. ఆనంద్ వద్ద రబ్బర్‌సీళ్లు, కంప్యూటర్, ఇతర ఉపకరణాలు దొరికాయి. ఆగ్నేయ విభాగ డిప్యూటీ పోలీస్ కమిషనర్ మహదేవజోíÙ, అసిస్టెంట్ కమిషనర్ పవన్, బేగూరు పోలీస్‌స్టేషన్ సీఐ మంజు ఈ కేసు విచారణలో పాల్గొన్నారు.