నరసరావుపేటలో డిగ్రీ విద్యార్థిని హత్య




నరసరావుపేట (లీగల్)‌: గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం రావిపాడు శివారులో దారుణం జరిగింది. ఓ ప్రైవేటు కళాశాలకు చెందిన విద్యార్థినిని తోటి విద్యార్థి గొంతు నులిమి హత్య చేశాడు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లాలోని ముప్పాళ్ల మండలం గోళ్లపాడు గ్రామానికి చెందిన అనూష(19) నరసరావుపేటలోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. అదే కళాశాలకు చెందిన విష్ణువర్ధన్‌‌ రెడ్డి మాట్లాడుకుందామని చెప్పి అనూషను ద్విచక్రవాహనంపై రావిపాడు శివారుకు తీసుకెళ్లాడు. అక్కడ ఆమెను గొంతు నులిమి హత్య చేశాడు. వెంటనే సమాచారం తెలుసుకున్న నరసరావుపేట గ్రామీణ పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. హత్య అనంతరం నిందితుడు ఠాణాలో లొంగిపోయాడు. 

మరోవైపు బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ కళాశాల విద్యార్థులు, కుటుంబసభ్యులు మార్చురీ వద్ద నుంచి మృతదేహంతో పల్నాడు రోడ్డు కూడలికి చేరుకొని ధర్నాకు దిగారు. కుటుంబ సభ్యులతో పోలీసులు చర్చలు జరిపినా ఫలితం లేకపోయింది. జిల్లా కలెక్టర్‌, ఎస్పీ హామీ ఇచ్చేంత వరకు ధర్నా విరమించేది లేదని వారు చెప్పారు. సమాచారం అందుకున్న తెదేపా, సీపీఐ, పలు సంఘాల నేతలు ధర్నా ప్రాంతానికి చేరుకొని మృతురాలి కుటుంబానికి న్యాయం జరిగే వరకు ధర్నా విరమించేది లేదని తేల్చి చెప్పారు. సుమారు మూడు గంటలుగా ధర్నా కొనసాగుతోంది. దీంతో రోడ్డుపై ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. హత్యకు ప్రేమ వ్యవహారమే కారణంగా పోలీసులు భావిస్తున్నారు.  

నరసరావుపేటలో డిగ్రీ విద్యార్థిని హత్య

నరసరావుపేటలో డిగ్రీ విద్యార్థిని హత్య


Post a Comment

Previous Post Next Post