చిరంజీవి కుటుంబం నుంచి వస్తున్న మరో కథానాయకుడు... పంజా వైష్ణవ్ తేజ్. బాల నటుడిగా పలు చిత్రాల్లో మెరిసినా... కథానాయకుడిగా ఆయన పరిచయవుతున్న చిత్రం ‘ఉప్పెన’. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ కలిసి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకొస్తోంది. పవన్‌కల్యాణ్ చేసిన ‘పంజా’ సినిమాపై ఇష్టంతోనే, మీ పేరుకి ముందు పంజా అని ఉందా? అని అడిగితే... ‘అది మా ఇంటి పేరు’ అంటూ వైష్ణవ్ తేజ్ సోమవారం విలేకర్లతో ముచ్చటించారు. ఆ విషయాలివీ...
చిన్నప్పుడే వెండితెరపై కనిపించారు. సినిమాల్లోకి రావాలనే ఆలోచన ఉండేదా?
అదేమీ లేదండీ. చిన్నప్పుడు బాగా సిగ్గుగా ఉండేవాణ్ని. కల్యాణ్ మామయ్యకి నా కళ్లంటే బాగా ఇష్టం. చిన్నప్పుడు ‘బొమ్మలు కొనిస్తా, సినిమా చేస్తావా’ అన్నారు. అలా ‘జానీ’లో నటించా. తర్వాత పెద్ద మామయ్య(చిరంజీవి) మా తాతయ్య కుర్చీలో కూర్చోబెట్టి కళ్లార్పకుండా అలా చూడరా అన్నారు. అలా చేశాక సినిమా చేస్తావా? అన్నారు. అలా ‘శంకర్‌దాదా ఎం.బి.బి.ఎస్’లో కుర్చీలో కనిపించే చిన్న పిల్లాడిలా నటించా. ఆ తర్వాత ‘అందరివాడు’. అంతే తప్ప సినిమాల్లోకి రావాలనేమీ ఉండేది కాదు.
మరేం చేయాలనుకున్నారు?
ఈ సినిమాకి ముందు నా కెరీర్‌ని నిర్ణయించుకోవడానికి రెండు మూడేళ్లు నాలో నేనే మదనపడిపోయా. సైంటిస్ట్, ఆస్ట్రోనాట్ అవుదామనుకునేవాణ్ని. ఆ తర్వాత దర్శకుడు అవుదామనుకున్నా. అన్నయ్య సెట్‌కి వెళ్లి అక్కడి పరిస్థితుల్ని చూశాక దర్శకత్వం ఎంత కష్టమో తెలిసొచ్చింది. ఆ తర్వాత జువెలరీ డిజైనర్, త్రీడీ యానిమేటర్, ఫొటోగ్రాఫర్... ఇలా చాలా కలలు కన్నా. ఒక దశలో ఏం చేయాలో తెలియడం లేదని మా అమ్మతో చెప్పా. అమ్మ, అన్నయ్య ‘సినిమాలు చేయొచ్చు కదా’ అన్నారు. నాకేమో భయంగా అనిపించింది. ‘ప్రాణాలు వృథాగా పోవడం ఎందుకు, దేశానికైనా ఇచ్చేద్దాం’ అనుకుని ఆర్మీలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నా. ఈలోగా జిమ్‌లో కసరత్తులు చేస్తూ నాజూగ్గా మారిపోయా. నా ఫొటోలు రెండు మూడు ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టా. వెంటనే రెండు సినిమా అవకాశాలు వచ్చాయి. చిరు మావయ్యకి చెబితే ‘నీకు అవకాశాలు వస్తున్నాయి కదా, వాటిని గౌరవించాలి. ఒకవేళ నువ్వు నిరూపించుకోలేకపోతే అప్పుడు వేరే ఏదైనా చేద్దువు’ అన్నారు. అప్పటిదాకా మావయ్యలా ఎవ్వరూ చెప్పలేదు. తొలి రెండు సినిమాల్లో నటించడం కుదరలేదు. మూడో అవకాశంగా ‘ఉప్పెన’తో కెమెరా ముందుకొచ్చేందుకు సిద్ధమయ్యా.
‘ఉప్పెన’ కోసం ప్రత్యేకంగా సన్నద్ధమయ్యారా?
‘ఉప్పెన’ అవకాశం విషయంలో నేను చాలా అదృష్టవంతుడిని. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, దేవిశ్రీప్రసాద్, విజయ్ సేతుపతి, శ్యామ్ దత్... ఇలా ఒక కలల కలయిక ఇది. దర్శకుడు బుచ్చిబాబు కథ చెప్పాక చిరంజీవి మావయ్య ‘చాలా మంచి కథ, చెయ్యరా’ అని చెప్పారు. అయితే ఇంత మంచి కథని నేను చేయగలనా? అనే భయపడ్డా. ఒక నెల రోజులపాటు నటనలో, ఉత్తరాంధ్ర యాస కోసం కొన్నాళ్లపాటు శిక్షణ తీసుకున్నా. విజయ్ సేతుపతితో పనిచేయడం చాలా థ్రిల్లింగ్‌గా అనిపించింది. అంత పెద్ద నటుడైనా అందరితోనూ కలుపుగోలుగా ఉంటారు. చిత్రీకరణ చివరి రోజు ఆయన మా అందరికీ డిన్నర్ ఇచ్చి, సెట్లో సిబ్బందికి ఒకొక్కరికి రూ. వెయ్యి ఇచ్చి వెళ్లారు. అంత మంచి మనిషి.
తొలి సినిమా విడుదల కాక ముందే, మరో సినిమానీ పూర్తి చేశారు కదా...ఎలా అనిపించింది?
రెండో సినిమా నాకు తొలి సినిమాలాగే అనిపించింది. తొలి సినిమా పూర్తయ్యాక ఆర్నెళ్లకి క్రిష్ దర్శకత్వం వహిస్తున్న నా రెండో సినిమా మొదలైంది. అప్పటికి నేర్చుకున్నదంతా మరిచిపోయి, మళ్లీ కొత్తగా మొదలుపెట్టినట్టు అనిపించింది.
నాకు యాక్షన్ సినిమాలంటే ఇష్టం. మా కుటుంబ కథానాయకుల సినిమాలే కాకుండా మహేష్‌బాబు, ఎన్టీఆర్, ప్రభాస్‌ల సినిమాల చూస్తూ ఆస్వాదిస్తుంటా. గన్స్ అంటే నాకు చాలా ఇష్టం. మిలటరీ నేపథ్యంలో యాక్షన్ సినిమా చేసే అవకాశం వస్తే చాలా సంతోషంగా చేస్తా. నా మూడో సినిమా ఇప్పటికే ఖరారైంది. ఆ వివరాలు త్వరలోనే తెలుస్తాయి.
ఎన్టీఆర్ అన్నని రామ్‌చరణ్ అన్న ఇంట్లో తొలిసారి కలిశాను. అప్పట్నుంచి తన సొంత తమ్ముడిలాగే చూస్తుంటారు. నా సినిమా గురించి తరచూ అడిగి తెలుసుకునేవారు. ఒకసారి ఫోన్ చేసి ‘నా పేరు ఎన్టీఆర్ అంటారండీ...’ అంటూ మాట్లాడారు. వెంటనే ఇంటికి వచ్చేయమన్నారు. వెళ్లాక ఆయన నాతో మాట్లాడిన విధానం చూసి షాక్ అయ్యా. మంచు మనోజ్ అన్న నాతోనూ, మా అన్నయ్యతోనూ చాలా సన్నిహితంగా ఉంటారు.