అందంగా మారాలనుకుంటే..!


అందంగా మారాలనుకుంటే..!
(ఫొటో: వీబో) సినీ తారలు ఎంత అందంగా ఉంటే.. వారికి అన్ని అవకాశాలు మెండుగా ఉంటాయనేది సినీ పరిశ్రమలో మాట. అందుకే చాలా మంది హీరోయిన్లు తమ శరీరంలో లోపాలున్న చోట శస్త్రచికిత్సతో సరిచేసుకొని మరింత అందంగా తయారయ్యేందుకు ప్రయత్నిస్తుంటారు. కొన్ని నెలల కిందట చైనాకు చెందిన గావో లూ అనే హీరోయిన్‌ కూడా ఇలాగే తన ముక్కు సైజును తగ్గించుకోవడానికి కాస్మోటిక్‌ సర్జరీ చేయించుకుంది. తన లోపం పోయి భవిష్యత్తు మరింత ఉజ్వలంగా ఉంటుందని ఆశపడింది. కానీ, జరిగింది మరొకటి. ముక్కు సైజు తగ్గడం దేవుడెరుగు ఇప్పుడు ఆ ముక్కు కణజాలాలు దెబ్బతిన్నాయి. ముక్కుపై మచ్చ ఏర్పడి అంద వికారంగా తయారైంది.

చైనాలో సెలబ్రిటీల నుంచి సామాన్య వ్యక్తుల వరకు అందరూ అందంగా కనబడాలని తరచూ సర్జీలు చేసుకుంటూనే ఉంటారు. గావో లూ అందంగానే ఉన్నా.. చేతినిండా ప్రాజెక్టులున్నా తన ముక్కును సర్జరీతో సరి చేసుకోవాలని భావించింది. స్నేహితుల సలహా మేరకు గ్వాంజావ్‌లోని ఓ ఆస్పత్రిలో చేరింది. నాలుగు గంటలపాటు వైద్యులు ఆమెకు సర్జరీ చేశారు. అయితే, ఈ ప్రక్రియలో గావో ముక్కు కొనలో ఉండే కణజాలాలు నశించడంతోపాటు ఇన్ఫెక్షన్‌కు గురయ్యాయి. నల్లటి మచ్చ ఏర్పడింది. కణాలు నశిస్తుండటంతో ఆ మచ్చ పెరుగుతూ వస్తోంది.

డ్రాగన్‌ దేశంలో కాస్మోటిక్‌ సర్జరీ అనేది రూ.వేల కోట్ల విలువ చేసే రంగం. అందుకే కొంతమంది డబ్బు సంపాదన కోసం సరైన అనుమతులు లేకుండానే ఆస్పత్రులను నిర్వహిస్తుంటారు. అలాంటి ఓ అనుమతి లేని ఆస్పత్రిలోనే గావో సర్జరీ చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న గావో యాజమాన్యంపై మండిపడింది. కానీ, ఏం లాభం? జరగాల్సిన నష్టం జరిగిపోయింది. తన ముక్కును సరి చేసుకోవాలంటే కనీసం ఏడాది పాటు ఆగాలని వైద్యులు సూచించారట.  

తనకు జరిగిన ఈ ఘటన గురించి గావో ఇటీవల చైనా సోషల్‌మీడియా వీబోలో తన అభిమానులకు వివరిస్తూ ఓ పోస్టు పెట్టింది. కాస్మోటిక్‌ సర్జరీల పట్ల అప్రమత్తగా ఉండాలని సూచించింది. గావో పరిస్థితి చూసి అభిమానులు, నెటిజన్లు జాలి పడుతున్నారు. 

Post a Comment

Previous Post Next Post