అభ్యర్థిత్వంపై కొనసాగుతున్న సస్పెన్స్ గంట గంటకూ ఉత్కంఠ రేసులో పలువురు
హైదరాబాద్ : గ్రేటర్ మేయర్ పదవి ఎవరిని వరించనుందన్నది ఇప్పుడు నగరంలో హాట్‌టాపిక్‌గా మారింది. సీల్డు కవరులో మేయర్, డిప్యూటీ మేయర్ల పేర్లను గురువారం రోజున.. ఎన్నికకు కొద్దిసేపు ముందు సీల్డు కవరులో పంపుతామని టీఆర్‌ఎస్ కార్యవర్గ సమావేశంలో సీఎం కేసీఆర్ ప్రకటించడంతో ఆ అదృష్టవంతులెవరా అన్నది ఇప్పుడు అంతటా చర్చనీయాంశంగా మారింది. గత కొంతకాలంగా ప్రచారంలో ఉన్న పేర్లకు మించి కొత్తపేర్లు తెరపైకి రాకపోయినప్పటికీ, వీరిలోనే ఒకరుంటారా.. లేక ఎవరి అంచనాలకు అందని విధంగా, ఊహించని రీతిలో కొత్తవారు రానున్నారా అన్న ఉత్కంఠ నెలకొంది. రాజకీయ ప్రముఖులు కేకే కుమార్తె విజయలక్ష్మి, పీజేఆర్ తనయ విజయారెడ్డి, కనకారెడ్డి కోడలు విజయశాంతిలతోపాటు కవితారెడ్డి, మోతె శ్రీలత, సింధురెడ్డి, పూజిత గౌడ్, బొంతు శ్రీదేవిల పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. మేయర్ అ య్యే వారికి ఉండాల్సిన లక్షణాలు, వారి ప్రవర్తన వల్ల పార్టీ ఇరకాటంలో పడుతుందా, బల్దియా కార్యక్రమాలు సాఫీగా సాగుతాయా వంటి అంశాల్ని పరిగణనలోకి తీసుకొని, అన్ని విధాలా తగునని భావించిన వారినే ఎంపిక చేసే వీలుందని టీఆర్‌ఎస్ వర్గాలు భావిస్తున్నాయి.
సామాజిక వర్గాలను పరిగణనలోకి తీసుకొని బీసీలకు ఇవ్వాలనుకుంటే శ్రీదేవి, పూజిత, విజయలక్ష్మిలలో ఒకరికి అవకాశం దక్కనుందని చెబుతున్నారు. బల్దియాలో బీజేపీ బలమైన ప్రతిపక్షంగా మారడం, ఎంఐఎంను అన్ని విషయాల్లో కలుపుకొని పోవడం, సర్వసభ్య సమావేశం, స్టాండింగ్ కమిటీ సమావేశాలను సవ్యంగా నడిపించగల సామర్థ్యం ఉందా లేదా.. తదితరమైనవి పరిగణనలోకి తీసుకోనున్నారని సమాచారం. దూకుడుగా, ఇగోలతో వ్యవహరించేవారి వల్ల పార్టీ ఇరకాటంలో పడుతుందని, అన్నింటినీ పరిశీలించి తగిన అర్హతలు ఉన్నవారికే అవకాశం లభించనున్నట్లు చెబుతున్నారు. అలాంటి లక్షణాలున్నాయని నమ్మినవారికే పదవి దక్కుతుందని, లేని పక్షంలో ఇప్పటి వరకు ఊహకే అందని వారు సైతం మేయర్ కావచ్చునని టీఆర్‌ఎస్ వర్గాల్లో వినిపిస్తోంది.ఆశావహులకు ఎమ్మెల్యేల బ్రేకులు..
కొందరు ఆశావహులకు తాము ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతాల్లోని స్థానిక ఎమ్మెల్యేల నుంచి వ్యతిరేకత ఉందనే ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యేల అభ్యంతరాల వల్ల అవకాశం చేజారే పరిస్థితి ఉందంటున్నారు. మేయర్ కూడా ఉంటే తమ ప్రాధాన్యత తగ్గుతుందని, ప్రొటోకాల్ , తదితరమైన వాటి దృష్ట్యా కొందరు ఎమ్మెల్యేలు తమ పరిధిలోని వారు మేయర్ కాకుండా ఉండేందుకు వారివంతు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.
పదవులు అడ్డొచ్చేనా?
విజయలక్ష్మి కోసం ఆమె తండ్రి కేకే తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని, దాదాపుగా ఖాయమని చెబుతున్నారు. మరోవైపు, ఆయన మూడు పర్యాయాలు రాజ్యసభ సభ్యుడు కావడం, రెండుసార్లు ఫ్లోర్‌లీడర్, ఆయన కుమారుడు టీయూఎఫ్‌ఐడీసీ చైర్మన్ కావడం వంటి అంశాలను ప్రస్తావిస్తూ ఒకే కుటుంబంలోని వారికే ఇన్ని పదవులిస్తే, మిగతా వారికి ఎలాంటి సందేశం వెళ్తుంది? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
డిప్యూటీ రేసులో...
డిప్యూటీ మేయర్ పదవికి రేసులో ఉన్నవారి పేర్లు కూడా పెరిగిపోతున్నాయి. సిట్టింగ్ బాబా ఫసియుద్దీన్‌కే మరోమారు అవకాశం దక్కనుందనే ప్రచారం జరుగుతున్నా, జగదీశ్వర్‌గౌడ్, షేక్ హమీద్, సబీహాబేగం, ఎం.నరసింహయాదవ్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. మేయర్ మహిళ కావడాన్ని కూడా పరిగణనలోకి తీసుకోనున్నారు.