కృష్ణా: గన్నవరం విమానాశ్రయంలో బుధవారం ఉదయం పొగమంచు కప్పేసింది. దట్టమైన పొగమంచు కారణంగా ల్యాండ్ అయ్యేందుకు వీలులేక బెంగుళూరు నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు వచ్చిన స్పైస్ జెట్ విమానం గాల్లో చక్కర్లు కొట్టింది. బెంగుళూరు నుంచి సుమారు 50మంది ప్రయాణికులతో గన్నవరం ఎయిర్‌పోర్టుకు వచ్చిన స్పైస్ జెట్ విమానం సుమారు అరగంట పాటు 8 సార్లు చక్కర్లు కొట్టింది. అనంతరం ల్యాండ్ అయ్యేందుకు వీలు లేకపోవడంతో తిరిగి హైదరాబాద్ వెళ్లిపోయింది. హైదరాబాద్ నుంచి గన్నవరం వచ్చిన ఇండిగో విమానం, ఢిల్లీ నుంచి వచ్చిన మరో ఇండిగో విమానాలు ల్యాండ్ అయ్యేందుకు వీలులేక గాల్లో చక్కర్లు కొట్టాయి. దాదాపు 10 గంటల వరకు ఇదే పరిస్థితి నెలకొంది.
ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయంలో ల్యాండ్ కావాల్సిన ఇండిగో విమానం ల్యాండ్ అయ్యేందుకు వీలు లేకపోవడంతో పాట్నాకి దారి మళ్లించినట్లు అధికారులు వెల్లడించారు. పొగమంచు కారణంగా పలు విమాన సర్వీసులకు అంతరాయం కలిగిందని ఎయిర్‌పోర్టు అధికారలు తెలిపారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నామని అధికారులు పేర్కొన్నారు. పొగ మంచు పరిస్థితులు చక్కబడ్డాక విమానాల ల్యాండింగ్‌కు తిరిగి అనుమతి ఇస్తామని అధికారులు తెలిపారు.