కారుతో ఢీకొట్టి.. రెండుసార్లు తొక్కించి

కాకినాడలో వైకాపా కార్పొరేటర్‌ దారుణ హత్య

కాకినాడ కలెక్టరేట్‌, సర్పవరం జంక్షన్‌, న్యూస్‌టుడే: ప్రశాంతమైన కాకినాడలో ఘోరమైన హత్య జరిగింది. ఓ వ్యక్తిని కారుతో ఢీకొట్టి.. అంతటితో ఆగకుండా రెండు సార్లు తొక్కించి అత్యంత కిరాతకంగా ప్రాణాలు తీశారు. పాత కక్షలతో సహచరులే ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా వలసపాకలలోని గంగరాజునగర్‌ కూడలి వద్ద జరిగింది. పోలీసుల వివరాల మేరకు.. కాకినాడ నగరపాలిక వైకాపా కార్పొరేటర్‌ కంపర రమేష్‌(48), మరో ఇద్దరు గంగరాజునగర్‌ కూడలి వద్ద గురువారం రాత్రి పార్టీ చేసుకున్నారు. వ్యాపార లావాదేవీల గురించి మాట్లాడేందుకు అక్కడికి రావాలని రమేష్‌, కాకినాడకు చెందిన గురజాన చిన్నాకు ఫోన్‌ చేశాడు. దీంతో చిన్నా, తన తమ్ముడు కుమార్‌తో కలిసి అక్కడి వచ్చాడు. అంతా కలిసి మద్యం తాగారు. వ్యాపార లావాదేవీల గురించి మాట్లాడే క్రమంలో ఘర్షణపడ్డారు. ఈ క్రమంలో రమేష్‌ కారు తాళాలు కనిపించలేదు. తాళాలు కనిపించకుండా ఎక్కడికి వెళ్తావని చిన్నా కారును రమేష్‌ అడ్డగించాడు. కారును ముందుకు తీసేందుకు ప్రయత్నించగా రమేష్‌ కారు ఎదురుగా నిల్చొని ఆపేయత్నం చేశాడు. నిందితుడు కారుతో బలంగా ఢీకొట్టి ముందుకు పోనిచ్చాడు. అంతటితో ఆగకుండా కారును వెనక్కి మళ్లించి రోడ్డుపై పడివున్న రమేష్‌ను రెండు సార్లు తొక్కించాడు. తీవ్రంగా గాయపడిన రమేష్‌ను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఘటనా స్థలాన్ని డీఎస్పీ వి.భీమారావు, సర్పవరం సీఐ నున్న రవి పరిశీలించారు. రియల్‌ ఎస్టేట్‌ లావాదేవీలు, పాత కక్షల నేపథ్యంలో హత్య జరిగి ఉంటుందని ప్రాథమికంగా గుర్తించారు.

కారుతో ఢీకొట్టి.. రెండుసార్లు తొక్కించి


Post a Comment

Previous Post Next Post