నాకూ ఫ్యాన్స్‌ ఉంటారని ఊహించలేదు


‘‘యాక్టింగ్‌ అంటే నాకు ఇష్టమే కానీ యాక్టర్‌గా మాత్రం కెరీర్‌ను ఊహించుకోలేదు. నాకు డాక్టర్‌ అవ్వాలని ఉండేది. కానీ ‘ఉప్పెన’ కథ విన్నాక ఈ సినిమా చేయాలనిపించింది. కథ విని, ఏడ్చాను. సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులు కూడా భావోద్వేగానికి గురవుతారనే నమ్మకం ఉంది’’ అని కృతీ శెట్టి అన్నారు. వైష్ణవ్‌ తేజ్, కృతీ శెట్టి జంటగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఉప్పెన’. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్‌ రైటింగ్స్‌ సంస్థలు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా కృతీ శెట్టి చెప్పిన విశేషాలు.

♦మా స్వస్థలం బెంగళూరు. కానీ ముంబైలో పుట్టి, పెరిగాను. నాన్న వ్యాపారవేత్త. అమ్మ ఫ్యాషన్‌ డిజైనర్‌. కొన్ని యాడ్‌ ఫిల్మ్స్‌ చేశాను. దర్శకుడు బుచ్చిబాబు నన్ను ఎక్కడో చూసి ఫోన్లో కాంటాక్ట్‌ అయ్యారు. మొదట్లో ఇప్పుడే సినిమాలు చేయకూడదని అనుకున్నాను. ఎందుకంటే సైకాలజీ చదువుకుంటున్నాను. అయినప్పటికీ కథ విందామని వచ్చి, నచ్చడంతో ఓకే చేశాను. ‘ఉప్పెన’ సినిమాలో బేబమ్మ క్యారెక్టర్‌ చేశాను. బేబమ్మది బబ్లీ అండ్‌ హైపర్‌ క్యారెక్టర్‌. చాలా ఎక్స్‌ప్రెసివ్‌. నేనే బేబమ్మనని ఊహించుకుని చేశాను. అందుకే స్క్రీన్‌పై అంత బాగా వచ్చింది. దర్శకుడు బుచ్చిబాబు, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ వివేక్, చిత్రబృందం సహాయం చేయడం వల్లే నేను తెలుగు ఇంత త్వరగా, ఇంత బాగా నేర్చుకోగలిగాను.
♦ఈ సినిమా కోసం ప్రత్యేకమైన యాక్టింగ్‌ క్లాసులు ఏం తీసుకోలేదు. యాడ్స్‌ చేసిన అనుభవం ఉపయోగపడింది. నాకు వచ్చినదాన్ని సహజంగా చేశాను. తెలుగు నేర్చుకోవడానికి మాత్రం కొన్ని వర్క్‌ షాప్స్‌ చేశాం. వైష్ణవ్‌ తేజ్‌ బ్రిలియంట్‌ యాక్టర్‌. మంచి సపోర్టింగ్‌ కో స్టార్‌. విజయ్‌సేతుపతిగారితో నాకో పెద్ద ఎమోషనల్‌ సీన్‌ ఉంది. ఇంత పెద్ద యాక్టర్‌తో ఎలా చేయాలా? అని భయపడ్డాను. కానీ ఆయన హెల్ప్‌ చేశారు. యాక్టింగ్‌ టిప్స్‌ కూడా చెప్పారు. 
♦ఓ భావోద్వేగభరితమైన సన్నివేశాన్ని చిత్రీకరించిన తర్వాత, నా నటన చూసి మా సినిమాటోగ్రాఫర్‌తో పాటు చిత్రబృందంలోని కొందరు ఏడ్చారు. అంత బాగా చేసినందుకు నాకు చాలా గర్వంగా, హ్యాపీగా అనిపించింది. ఈ సినిమా జర్నీలో నాకు ఇదొక మంచి జ్ఞాపకం. అయితే నా ఇంట్రడక్షన్‌ సీన్‌ కోసం మాత్రం ఎక్కువ టేక్స్‌ తీసుకున్నాను.
♦ఈ సినిమాతో అసోసియేట్‌ అయ్యాక దర్శకుడు సుకుమార్‌ను కలిశాను. ఆయన ఇచ్చిన ధైర్యాన్నే నేను సినిమాలో క్యారీ చేశాను. నా తొలి సినిమాకే సుకుమార్, మైత్రీమూవీ మేకర్స్, దేవి శ్రీ ప్రసాద్‌గారు వంటివారితో అసోసియేట్‌ అవ్వడాన్ని అదృష్టంగా ఫీల్‌ అవుతున్నాను. హీరోయిన్స్‌లో దివంగత నటి శ్రీదేవిగారు, సమంత నాకు స్ఫూర్తి.
♦‘ఉప్పెన’ సినిమాను కొందరు ప్రముఖులు చూశారు. చిరంజీవిగారు బిగ్‌ స్టార్‌. నాకు ఇన్స్‌పిరేషన్‌. అలాంటి ఆయన మా సినిమా ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌లో నన్ను అభినందించడం చాలా గర్వంగా అనిపించింది. దర్శకులు కొరటాల శివ, సుకుమార్, మా నిర్మాతలు రవిశంకర్, నవీన్‌గార్లు కూడా నా పెర్ఫార్మెన్స్‌ బాగుందని చెప్పారు. 
♦సోషల్‌ మీడియాలో నాకు ఫ్యాన్‌ క్లబ్స్‌ ఉన్నాయని నా సన్నిహితులు చెప్పారు. నాక్కూడా ఫ్యాన్స్‌ ఉంటారని ఎప్పుడూ ఊహించలేదు. నిజానికి నేనే చాలామంది స్టార్స్‌కు అభిమానిని. నా అభిమానుల సపోర్ట్‌ అండ్‌ లవ్‌కు థ్యాంక్స్‌.
♦‘ఉప్పెన’ సినిమా విడుదలయ్యాకే కొత్త సినిమాలకు ఓకే చెబుదాం అనుకున్నాను. కానీ కథలు నచ్చడంతో ‘శ్యామ్‌ సింగరాయ్, ‘శ్రీదేవి సోడా సెంటర్‌’ సినిమాల్లో నటించేందుకు ఒప్పుకున్నాను.

Post a Comment

Previous Post Next Post