తొలి దశ పంచాయతీ ఎన్నికల్లో భారీగా ఓట్లేసిన జనం
81.4% పోలింగ్ గరిష్ఠంగా కృష్ణా జిల్లాలో 85.06% కనిష్ఠంగా శ్రీకాకుళంలో 75.77%
తొలిదశ పంచాయతీ ఎన్నికల్లో భారీగా 81.42% పోలింగు నమోదైంది. కరోనా భయాన్ని పక్కన పెట్టి పోలింగు కేంద్రాలకు ఓటర్లు తరలివచ్చారు. విజయనగరం మినహా మిగతా 12 జిల్లాల్లో 2,723 సర్పంచి, 20,157 వార్డు సభ్యుల స్థానాలకు 29,732 కేంద్రాల్లో ఉదయం 6.30 గంటలకు పోలింగు ప్రారంభమైంది. మొదటి రెండు గంటలు కాస్త మందకొడిగా సాగినా.. క్రమంగా జోరందుకుంది. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 2.30 వరకు 75.55% మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. పోలింగు ముగిసే సమయానికి కృష్ణాజిల్లాలో గరిష్ఠంగా 85.06%, శ్రీకాకుళం జిల్లాలో కనిష్ఠంగా 75.77% పోలింగు నమోదైంది.
కర్నూలు, కడప జిల్లాల్లో 3.30 తర్వాత కూడా కొన్ని పోలింగు కేంద్రాల్లో ప్రజలు ఓటుహక్కు వినియోగించుకున్నారు. గడువు ముగిసే సమయానికి ముందే వచ్చి వరుసలో నిల్చున్న వారిని అనుమతించారు. మిగతా 10 జిల్లాల్లోని అత్యధిక కేంద్రాల్లో మధ్యాహ్నం 3.30కు పోలింగు నిలిపివేశారు. 4 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మొదట వార్డు సభ్యుల ఓట్లు, తర్వాత సర్పంచి అభ్యర్థుల ఓట్లు లెక్కించి విజేతలను ప్రకటించారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేశ్‌కుమార్ విజయవాడలోని తమ కార్యాలయం నుంచి పోలింగును వెబ్ కాస్టింగులో పరిశీలించారు. తాడేపల్లిలోని పంచాయతీరాజ్‌శాఖ కమిషనర్ కార్యాలయంలో కమాండు కంట్రోల్ సెంటర్ నుంచి సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక గ్రామాల్లో పోలింగును కమిషనర్ గిరిజాశంకర్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
* కరోనా సోకిన దాదాపు వెయ్యిమంది ఓటుహక్కు వినియోగించుకున్నారని అధికారులు తెలిపారు. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 3.30 గంటల మధ్య వీరిని అనుమతించారు.
* పార్టీలకు అతీతమైనా ప్రధాన రాజకీయ పక్షాలు ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో అభ్యర్థులు హోరాహోరీగా తలపడ్డారు. వ్యక్తిగత ప్రతిష్ఠను పణంగా పెట్టి ఎక్కువ మంది పోలింగులో పాల్గొనేలా చేసిన ప్రయత్నం ఫలించిందని ఓ నాయకుడ[ు వ్యాఖ్యానించారు.
పోలింగుపై ఎస్‌ఈసీ సంతృప్తి
తొలి దశ పంచాయతీ ఎన్నికల పోలింగుపై ఎస్‌ఈసీ రమేశ్‌కుమార్ సంతృప్తి వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లాలో అత్యధికంగా 85.06% పోలింగు నమోదై రికార్డు సృష్టించినట్లు పేర్కొన్నారు. ప్రజలు ఎంతో ఉత్సాహంగా పోలింగులో పాల్గొని ఓటు హక్కును వినియోగించుకున్నారని సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గత ఎన్నికలతో పోల్చిచూస్తే కొన్ని ఘటనలు మినహా పోలింగు ప్రశాంతంగా జరిగిందని ఆయన వివరించారు. కలెక్టర్లు, జిల్లా ఎన్నికల యంత్రాంగం, ఎస్పీలు, పోలింగు సిబ్బంది కృషి అభినందనీయమని, భద్రత కల్పించడంలో పోలీసులు అద్భుతమైన పనితీరును కనబరిచారని ఎస్‌ఈసీ కితాబిచ్చారు. ఇదో శుభారంభమని, మిగతా దశల్లో ఎన్నికలూ ఇదే ప్రశాంత వాతావరణంలో జరిగి ప్రజాస్వామ్యం, వ్యవస్థలు బలోపేతమవుతాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.