ప్రేమికుల రోజున విషాదం


అనూష

శంకర్‌పల్లి మున్సిపాలిటీ, న్యూస్‌టుడే: ఫేస్‌బుక్‌ పరిచయం ప్రేమగా మారింది. పెద్దలను ఒప్పించి ఆ జంట ఒక్కటవ్వాలనుకుంది. కానీ యువతి తల్లిదండ్రులు పెళ్లికి నిరాకరించడంతో ఆమె ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. ప్రేమికుల రోజునే జరిగిన ఈ విషాద ఘటన శంకర్‌పల్లి మండలం మోకిలా తాండలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. ఈ ప్రాంతానికి చెందిన అనూష(19), మహారాష్ట్రకు చెందిన యువకుడు(27) ఒకరికొకరు ఫేస్‌బుక్‌లో పరిచయమయ్యారు. కొన్నాళ్లుగా ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. ఎలాగైనా ఇద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. యువతిని తన రాష్ట్రానికి రమ్మని కోరాడు. దీంతో గత నెల 19న బెంగళూరుకు వెళ్తున్నానని చెప్పి అనూష ఇంట్లోంచి వెళ్లింది. అప్పటి నుంచి ఆమె ఫోన్‌ స్విచ్ఛాప్‌ రావడంతో తల్లిదండ్రులు శంకర్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కాల్‌డేటా సాయంతో యువతి ఆచూకీ తెలుసుకున్న పోలీసులు ఇంటికి రావాలని కోరారు. ఆ మేరకు శనివారం రాత్రి ఇంటికి చేరుకుని, ప్రేమ విషయం తల్లిదండ్రులకు చెప్పింది. వాళ్లు ఒప్పుకోకపోగా.. తీవ్రంగా మందలించారు. మనస్తాపానికి గురైన యువతి ఆదివారం ఉదయం స్నానానికని బాత్‌రూంలోకి వెళ్లి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు శంకర్‌పల్లి ఎస్సై లక్ష్మీనారాయణ తెలిపారు.

Post a Comment

Previous Post Next Post