హైదరాబాద్: వ్యక్తిగత రుణాలిచ్చే చైనా కంపెనీలు రుణగ్రహీతల ముక్కుపిండి మరీ 72 శాతం వడ్డీని వసూలు చేస్తున్నాయి. ఈ యాప్‌ల అక్రమాలను వెలికితీస్తున్న క్రమంలో సైబర్ క్రైమ్ పోలీసులకు ఇందుకు సంంధించిన ఆధారాలు లభించాయి. మరిన్ని సాక్ష్యాధారాల కోసం ఈ కేసులో నిందితుడైన చైనా వాసి ల్యాంబోను అప్పగించాలని కోర్టును అభ్యర్థించారు. ల్యాంబోను ప్రశ్నించేందుకు మాండరిన్ భాషలో ప్రశ్నలను సిద్ధం చేస్తున్నామని పోలీసువర్గాలు వెల్లడించాయి.
అప్పులిస్తున్న చైనా కంపెనీలు ప్రతి 15రోజులకో మారు వడ్డీని లెక్కకడుతున్నాయి. రుణం తీసుకున్న వ్యక్తి 15 రోజులలోపు లేదా పదిహేనో రోజు అసలుతో పాటు 36 శాతం వడ్డీ చెల్లించాలి. లేదంటే అదనంగా మరో 4శాతం వడ్డీ చెల్లించాలంటూ బెదిరింపులు, హెచ్చరికలతో ఊపిరి సలపకుండా చేస్తాయి. రుణం సమయానికి చెల్లించకపోతే బాధితులకు వరుసగా ఫోన్లు చేస్తామని కాల్‌సెంటర్ల నిర్వాహకులు, ఆయా కంపెనీలో పని చేస్తున్నవారు తెలిపారు. చైనా కంపెనీలు వర్చువల్ ఖాతాల సేవలను ఐసీఐసీఐ బ్యాంకు, పేమెంట్ గేట్‌వే సేవలను రోజర్‌పే సంస్థ అందిస్తున్నాయి. వీటికి సంబంధించిన లెక్కల పత్రాలను సమర్పించాలంటూ సైబర్ క్రైమ్ పోలీసు అధికారులు ఐసీఐసీఐ బ్యాంకు, రోజర్‌పే సంస్థకు రెండు సార్లు తాఖీదులివ్వగా బ్యాంకు, రోజర్‌పే ప్రతినిధులు శనివారం సైబర్ క్రైమ్ పోలీసు ఠాణాకు వచ్చారు. కొద్దిరోజుల సమయం ఇస్తే సమగ్ర వివరాలు అందిస్తామని తెలిపారు.
పేట్‌బషీరాబాద్, న్యూస్‌టుడే: రుణ యాప్‌లకు మరో వ్యక్తి బలయ్యాడు. కామారెడ్డి జిల్లా కేంద్రం సమీపంలోని దేవునిపల్లి గ్రామానికి చెందిన గుజ్జ చంద్రమోహన్(36) మేడ్చల్ మండలం గుండ్లపోచంపల్లికి చెందిన సరితను వివాహం చేసుకొని ఇక్కడే ఉంటున్నారు. వీరికి ముగ్గురు కుమార్తెలు. చంద్రమోహన్ కాపలాదారుగా పని చేసేవారు. అతడు రుణ యాప్‌ల నుంచి రూ.5 వేల నుంచి రూ.30 వేల వరకు అప్పు పొందాడు. తిరిగి చెల్లించమని ఒత్తిడి రావడంతో మరికొన్ని యాప్‌ల నుంచి రూ.5 లక్షల వరకు తీసుకొని చెల్లించారు. అయినా రాత్రి, పగలు తేడా లేకుండా ఫోన్‌లో వేధింపులు మొదలయ్యాయి. బాధితుడి భార్యకూ ఫోన్ చేసి బూతులు మాట్లాడేవారు. చంద్రమోహన్ కాల్‌లిస్టులోని నంబర్లకూ ఫోన్లు చేసేవారు. దాంతో సైబర్ సెక్యూరిటీ వింగ్ పోలీసులకు ఆన్‌లైన్ ద్వారా ఫిర్యాదు చేశారు. పోలీసులు ఓ సారి కౌన్సిలింగ్ ఇచ్చారు. అయినా తీవ్ర మనోవేదనతో శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.