మరో యాంజియోప్లాస్టీ అవసరమన్న ఆసుపత్రి వర్గాలు
కోల్కతా: బీసీసీఐ అధ్యక్షుడు, భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీని బుధవారం డిశ్చార్జి చేయనున్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. అయితే మరికొన్ని రోజుల్లో లేదా వారాల్లో అతనికి మరోసారి యాంజియోప్లాస్టీ చేయాల్సి ఉంటుందని వుడ్ల్యాండ్స్ ఆసుపత్రి ఎండీ, సీఈవో రూపాలి బసు తెలిపారు. ప్రముఖ కార్డియాలజిస్టు దేవీ శెట్టి మంగళవారం గంగూలీని పరీక్షించిన తర్వాత తదుపరి చికిత్స గురించి వైద్యులకు సూచనలిస్తారని ఆమె చెప్పారు. ‘ప్రస్తుతం గంగూలీ ఆరోగ్యం నిలకడగా ఉన్నందున ఇప్పుడే యాంజియోప్లాస్టీ చేయాల్సిన అవసరం కనిపించలేదు. కానీ కొన్ని రోజుల్లో కచ్చితంగా యాంజియాప్లాస్టీ చేయాల్సి ఉంటుంది. బుధవారం డిశ్చార్జి చేస్తాం. తర్వాత కూడా వైద్యులు నిరంతరం ఆయనను పర్యవేక్షిస్తుంటారు’ అని రూపాలి బసు వెల్లడించారు. మరోవైపు సోమవారం గంగూలీని బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, కార్యదర్శి జై షా పరామర్శించారు.