పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్మూ-కశ్మీర్‌లోని రాజౌరీ జిల్లా నౌషేరా సెక్టార్‌లో నియంత్రణ రేఖ(ఎల్‌వోసీ) వెంబడి శనివారం మోర్టార్లతో దాడికి దిగింది. పాక్ దాడులను భారత బలగాలు సమర్థంగా తిప్పికొట్టినట్లు సైనికాధికారులు తెలిపారు. అంతకుముందు ఇదే సెక్టార్‌లో.. పాక్ చేసిన దాడిలో గాయపడిన నాయబ్ సుబేదార్ రవీందర్ శుక్రవారం మృతి చెందినట్లు వెల్లడించారు.
గ్రనేడ్ దాడిలో ఆరుగురికి గాయాలు
జమ్మూ-కశ్మీర్‌లోని పుల్వామా జిల్లా థ్రాల్ ప్రాంతంలో.. గ్రనేడ్‌తో శనివారం మిలిటెంట్లు చేసిన దాడిలో ఆరుగురు పౌరులు గాయాలపాలయ్యారు. థ్రాల్ బస్టాండు వద్ద భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు గ్రనేడ్లను విసరగా.. అది గురితప్పి పక్కనే ఉన్న మార్కెట్‌లో పడి పేలినట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. దాడికి పాల్పడినవారిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.