ముంబయి: టాలీవుడ్‌లో డ్రగ్స్ బాగోతం బయటపడింది. సుశాంత్‌సింగ్ కేసులో భాగంగా బయటపడ్డ డ్రగ్స్ కేసు మొన్నటి వరకూ బాలీవుడ్‌లో కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. అది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఇదిలా ఉండగానే.. ముంబయిలోని మిరా రోడ్డులో ఉన్న ఓ హోటల్‌లో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సీబీ) అధికారులు సోదాలు చేశారు. ఈ క్రమంలో డ్రగ్స్ విక్రయిస్తున్న వ్యక్తితో పాటు ఓ టాలీవుడ్ నటిని అదుపులోకి తీసుకున్నారని సమాచారం. డ్రగ్స్ విక్రయిస్తున్న చాంద్ మహమ్మద్‌ను నుంచి 400గ్రాముల మెఫెడ్రోన్ స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ సుమారు రూ.8-10లక్షల వరకూ ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. కాగా.. డ్రగ్స్ సరఫరా చేసే సయ్యద్ పరారీలో ఉన్నట్లు ఎన్‌సీబీ వర్గాల ద్వారా తెలిసింది. అయితే.. ఆ టాలీవుడ్ నటి ఎవరన్నది తెలియాల్సి ఉంది.
మరోవైపు.. బాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఎన్‌సీబీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే పలువురు బాలీవుడ్ ప్రముఖులను ఎన్‌సీబీ విచారించింది. ఈక్రమంలోనే సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోయిక్ చక్రవర్తిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. తర్వాత ముంబయి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేయడంతో వాళ్లు బయటికి వచ్చిన విషయం తెలిసిందే.