
జనసేన కార్యకర్తపై ఎమ్మెల్యే ఫైర్, పవన్ కళ్యాణ్
సమస్యలపై ప్రశ్నిస్తే ప్రాణాలు పోగొట్టుకోవలసిందేనా అని పవన్ కళ్యాణ్ భావోద్వేగం చెందారు. జనసేన కార్యకర్త బండ్ల వెంగయ్య నాయుడు ఆత్మహత్య బాధాకరమని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వెంగయ్య ఆత్మహత్యకు అధికార పక్షం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ‘‘వైసీపీ నిరంకుశ పాలనకు నిదర్శనమిది. గ్రామంలో పారశుద్ధ్య సమస్యపై ఎమ్మెల్యేను ప్రశ్నించడం తప్పా. కనీసం సమాధానం ఇవ్వలేని స్థితిలో ఎమ్మెల్యే రాంబాబు ఉన్నారా? ‘నీ మెడలో పార్టీ కండువా తీయ్...’ అని మొదలుపెట్టి సభ్యసమాజం పలకలేని భాషలో మాట్లాడతారా? ప్రశ్నించిన ఆ యువకుణ్ని ప్రజల మధ్యనే ఎమ్మెల్యే బెదిరించారు. వివిధ రూపాల్లో ఒత్తిళ్లకు గురి చేసినట్లు మాకు సమాచారం అందింది.’’ అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

వెంగయ్య నాయుడు మరణంపై సమగ్ర విచారణ చేయించాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. అలాగే అధికార పక్షం ఈ ఆత్మహత్యకు బాధ్యత వహించాలన్నారు. వెంగయ్యను ఆత్మహత్యకు ప్రేరేపించిన ఎమ్మెల్యే, ఆయన అనుచరులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. వెంగయ్య నాయుడు కుటుంబానికి పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని జనసేనాని పవన్ భరోసా ఇచ్చారు.