అఖిలప్రియ అరెస్టు..‘ఆ భూములు మా నాన్న కొన్నవి.. ఇవ్వాల్సిందే’

ప్రవీణ్‌రావు సోదరుల కిడ్నాప్‌ కేసులో ఏ2గా ఏపీ మాజీ మంత్రి
ఏ1గా ఏవీ సుబ్బారెడ్డి, ఏ3గా అఖిల భర్త భార్గవరామ్‌
 హైదరాబాద్‌లో రూ.2 వేల కోట్ల భూ వివాదం

అఖిలప్రియ అరెస్టు

హైదరాబాద్‌, న్యూస్‌టుడే- బృందం: హైదరాబాద్‌లో ముగ్గురు వ్యాపారుల కిడ్నాప్‌ కేసుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ మాజీ మంత్రి, తెదేపా నాయకురాలు భూమా అఖిలప్రియ, కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు చెందిన ఆ పార్టీ నాయకుడు ఏవీ సుబ్బారెడ్డిలను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. న్యాయమూర్తి ఆమెకు 14 రోజుల రిమాండ్‌ విధించడంతో చంచల్‌గూడ మహిళా జైలుకు తరలించారు. మియాపూర్‌ సమీపంలోని హఫీజ్‌పేటలో రూ.2 వేల కోట్ల విలువైన 48 ఎకరాల వివాదాస్పద భూమి వ్యవహారంలో ప్రవీణ్‌రావు, నవీన్‌రావు, సునీల్‌రావులను మంగళవారం రాత్రి కిడ్నాప్‌ చేయించారన్న ఫిర్యాదుపై ఏ1గా ఏవీ సుబ్బారెడ్డి, ఏ2గా అఖిలప్రియ, ఏ3గా ఆమె భర్త భార్గవరామ్‌లపై కేసు నమోదు చేశామని కొత్వాల్‌ అంజనీకుమార్‌ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఏ1, ఏ2లను అరెస్టు చేశామని, భార్గవరామ్‌ పరారీలో ఉన్నాడని తెలిపారు. కిడ్నాప్‌ చేసిన వారిలో శ్రీనివాస్‌ చౌదరి అలియాస్‌ గుంటూరు శ్రీను, సాయి, చంటి, ప్రకాష్‌లున్నారని, వారినీ అరెస్టు చేస్తామన్నారు. కిడ్నాప్‌ జరిగిన వెంటనే పోలీసులు అప్రమత్తమై అన్వేషణ ముమ్మరం చేయడంతో నిందితులు బుధవారం తెల్లవారుజామున 3.30 గంటలకు కోకాపేట-నార్సింగి రహదారిలో బాధితులను వదిలిపెట్టి పారిపోయారని వివరించారు. ఈ కేసు వివరాలు ఆయన మాటల్లోనే...
అఖిలప్రియ అరెస్టుఆదాయపు పన్ను అధికారులమంటూ సెర్చి వారెంట్‌
బోయిన్‌పల్లిలోని మనోవికాస్‌నగర్‌లో ఉంటున్న ప్రవీణ్‌, నవీన్‌, సునీల్‌లను బెదిరించి భూమి హక్కులను రాయించుకునేందుకు ఏవీ సుబ్బారెడ్డి, భూమా అఖిలప్రియ పథకం రచించారు. వారి అనుచరులకు ఆదాయపు పన్నుశాఖ, పోలీసు అధికారులుగా వేషాలు వేయించారు. సుమారు 15 మంది నకిలీ గుర్తింపు కార్డులు ధరించి మూడు కార్లలో మంగళవారం రాత్రి 7 గంటలకు ప్రవీణ్‌రావు నివాసానికి వెళ్లారు. ఐటీ అధికారులమంటూ నకిలీ సెర్చి వారెంట్లు చూపించారు. సోదాల మిషతో మహిళలు, పిల్లలను ఒక గదిలో ఉంచి తాళం వేశారు. అనంతరం ప్రవీణ్‌రావు సహా ముగ్గురినీ బెదిరించి కార్లలో తీసుకెళ్లారు. గంటసేపైనా అలికిడి లేకపోవడంతో ప్రవీణ్‌రావు కుటుంబ సభ్యులు పక్క ఫ్లాట్‌లో వారికి ఫోన్‌ చేయగా.. ఓ మహిళ వచ్చి తాళం తీశారు. ప్రవీణ్‌, నవీన్‌, సునీల్‌ కనిపించకపోవడంతో వారు భయాందోళనలకు గురయ్యారు.
పాదచారుడు ఇచ్చిన సమాచారంతో..
కిడ్నాప్‌ చేసి కార్లలో తీసుకెళ్తుండగా, రాణిగంజ్‌ వద్ద ప్రవీణ్‌ గట్టిగా కేకలు వేయడంతో ఓ పాదచారి అనుమానించి డయల్‌ 100కు ఫోన్‌ చేశారు. దీంతో ఉత్తర మండలం పోలీసులు హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ ప్రధాన కంట్రోల్‌ రూంలను అప్రమత్తం చేశారు. ఈలోగా మహబూబాబాద్‌ ఎంపీ మాలోత్‌ కవిత బోయిన్‌పల్లి పోలీసులకు ఫోన్‌ చేసి ప్రవీణ్‌రావు ఇంట్లో ఏదో జరుగుతోందని చెప్పారు. ఉత్తర మండలం డీసీపీ కల్మేశ్వర్‌ శింగన్వార్‌ వెళ్లి బాధితుల కుటుంబ సభ్యులతో చర్చించారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు 15 బృందాలను ఏర్పాటు చేశారు.
ఎనిమిది గంటలు కార్లలోనే...
కిడ్నాపర్లు బాహ్యవలయ రహదారి మీదుగా బాధితులను మహారాష్ట్రకు తరలించాలనుకున్నారు. పోలీసుల తనిఖీలు ముమ్మరం కావడంతో రాత్రంతా బాహ్యవలయ రహదారులపైనే సంచరించారు. చివరకు బుధవారం తెల్లవారుజామున 3.30 గంటలకు నార్సింగి-కోకాపేట మార్గంలో బాధితులను వదిలేయగా, పోలీసులు సురక్షితంగా ఇంటికి చేర్చారు.
అఖిలప్రియ విచారణ.. వైద్యపరీక్షలు
బాధితులిచ్చిన సమాచారం మేరకు పోలీసులు బుధవారం ఉదయం 11 గంటలకు కూకట్‌పల్లిలోని లోధా అపార్ట్‌మెంట్స్‌లో ఉంటున్న భూమా అఖిలప్రియ ఇంటికి వెళ్లారు. ఆమెను, ఆమె తమ్ముడు జగద్విఖ్యాత్‌లను బోయిన్‌పల్లి పోలీస్‌ ఠాణాకు తరలించారు. అఖిలప్రియకు గాంధీ ఆసుపత్రిలో వైద్యపరీక్షలు చేయించి, న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. మాదాపూర్‌లోని ఓ ఫ్లాట్‌లో ఉంటున్న ఏవీ సుబ్బారెడ్డిని బుధవారం రాత్రి ఏడు గంటలకు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు.

అఖిలప్రియ అరెస్టు
 

ప్రవీణ్‌రావు, సోదరులను బెదిరించినట్లు ఆధారాలు సేకరించిన పోలీసులు
మాట వినకపోవడంతో అపహరణ యత్నం
మియాపూర్‌ ఠాణాలో ఏవీ సుబ్బారెడ్డిపై గతంలో కేసు

‘ఆ భూములు మా నాన్న కొన్నవి.. ఇవ్వాల్సిందే’

 హైదరాబాద్‌, న్యూస్‌టుడే, మియాపూర్‌: ‘హఫీజ్‌పేట సర్వే నంబరు 80లో మా నాన్న కొన్న భూములవి. మీ సొంతమని ఎలా అంటారు? సంతకం పెడతారా? లేదా?’ అంటూ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ వ్యాపారులు ప్రవీణ్‌, నవీన్‌, సునీల్‌రావులకు ఫోన్లు చేసి బెదిరించినట్టు బోయిన్‌పల్లి పోలీసులు ఆధారాలు సేకరించారు. మొత్తం 48 ఎకరాలుంటే 25 ఎకరాల్లో నిర్మాణాలు చేపట్టేందుకు అఖిలప్రియ సన్నాహాలు చేస్తున్నారని వారు చెప్పారు.
రాజీ ఫలించక స్వాధీన యత్నం
హఫీజ్‌పేటలోని 48 ఎకరాల భూములను చాలా ఏళ్లక్రితం భూమా నాగిరెడ్డి కొనుగోలు చేశారని ఆయన కుటుంబీకులు చెబుతున్నారు. ఐదేళ్లక్రితం ప్రవీణ్‌రావు అదే సర్వే నంబరులో 25 ఎకరాలు కొనుగోలు చేశారని ఆయన కుటుంబీకులు చెబుతున్నారు. దీనిపై వివాదం తలెత్తడంతో ప్రవీణ్‌రావు వర్గీయులు రాజీ కోసం ఏవీ సుబ్బారెడ్డిని సంప్రదించారు. ఈలోగా నాగిరెడ్డి మృతి చెందారు. గత ఏడాది సెప్టెంబరులో ఏవీ సుబ్బారెడ్డి ఆ భూముల స్వాధీనానికి ప్రయత్నించగా, ప్రవీణ్‌రావు మియాపూర్‌ పోలీసు ఠాణాలో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఏవీ సుబ్బారెడ్డిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. నాగిరెడ్డి చనిపోయాక భూములను సొంతం చేసుకునేందుకు అఖిలప్రియ, ఆమె సోదరి మౌనిక ప్రయత్నిస్తున్నారు.
కిడ్నాపర్లకు శిక్షణ.. పక్కాగా రెక్కీ
ప్రవీణ్‌రావు, అతడి సోదరులు తమ మాట వినడం లేదని అఖిలప్రియ, ఆమె భర్త భార్గవరామ్‌ వారి అపహరణకు పథకం వేశారని పోలీసులు తెలిపారు. కర్నూలు, గుంటూరు జిల్లాల్లో కిడ్నాప్‌లకు పాల్పడుతున్న ముఠాలతో మాట్లాడారు. వారం రోజుల క్రితం 15 మందిని హైదరాబాద్‌కు రప్పించారు. హైదరాబాద్‌ శివార్లలోని భార్గవరామ్‌ స్నేహితుడికి చెందిన ఓ పాఠశాలలో వారిని ఉంచి ఆదాయపుపన్ను అధికారుల్లా నటించాలంటూ శిక్షణ ఇచ్చారు. ప్రవీణ్‌, నవీన్‌, సునీల్‌రావులుంటున్న ఇంటి వద్ద కిడ్నాపర్లు నాలుగు రోజుల నుంచి రెక్కీ నిర్వహించి మంగళవారం రాత్రి రంగంలోకి దిగారు.
నాకు సంబంధం లేదు: ఏవీ సుబ్బారెడ్డి
‘కిడ్నాప్‌ వ్యవహారంలో తనకు సంబంధం లేదని ఏ1 నిందితుడు ఏవీ సుబ్బారెడ్డి అన్నారు. పోలీసులు అదుపులోకి తీసుకునే ముందు ఆయన మాదాపూర్‌లోని ఓ హోటల్‌లో విలేకరులతో మాట్లాడారు. ‘నన్ను చంపేందుకు భూమా అఖిలప్రియ సుపారీ ఇచ్చారు. ఆమెతో కలిసి నేనెందుకు కిడ్నాప్‌కు ప్రణాళిక వేస్తాను? ఈ కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదు. భూమా అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ రామ్‌లతోనూ సంబంధాలు లేవు. పోలీసులకు పూర్తిగా సహకరిస్తా’ అని అన్నారు.
చంచల్‌గూడ జైలుకు అఖిలప్రియ
నిందితురాలు అఖిలప్రియకు 11వ అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ ఆశాజ్యోతి 14 రోజుల రిమాండ్‌ విధించారు. అఖిలప్రియ అస్వస్థతకు గురవడంతో బుధవారం రాత్రి కొద్దిసేపు బేగంపేట మహిళా పోలీసు ఠాణాలో ఉంచారు. అనంతరం ఆమెను చంచల్‌గూడ మహిళా జైలుకు తరలించారు. పోలీసులు తమ సోదరిని ఉదయం అదుపులోకి తీసుకున్నారని, మధ్యాహ్నం భోజనం ఇస్తామన్నా అనుమతించలేదని ఆమె సోదరి మౌనిక తెలిపారు.

Post a Comment

Previous Post Next Post