అడిగిన నగదు ఇవ్వలేదని స్నేహితుని హత్య : చచ్చే ముందైనాఏటీఎం పిన్‌ నంబరు చెప్పు


చచ్చే ముందైనా.. ఏటీఎం పిన్‌ నంబరు చెప్పు

యువరాజ్‌ మృతదేహాన్ని పూడ్చిపెట్టిన ప్రాంతాన్ని పరిశీలిస్తున్న

డీఎస్పీ శ్రీనివాసరావు (అంతర చిత్రంలో మృతుడు యువరాజ్‌ విశ్వకర్మ)

డబ్బు కోసం తన స్నేహితుని ప్రాణమే తీశాడు ఓ కిరాతకుడు. రెండేళ్ల స్నేహాన్ని మరచి.. కత్తితో డబ్బు ఇవ్వలేదన్న కోపంతో కసితీరా.. గొంతు కోశాడు. ఆపై బాధతో విలవిలలాడుతూ.. చివరి క్షణాల్లో ఉన్న స్నేహితున్ని ‘ ఎలాగూ చస్తావ్‌.. ఇపుడైనా నీ ఏటీఎం పిన్‌ నంబరు చెప్పు’ అంటూ బతిమాలాడు. ప్రాణం పోతున్నా.. అతను నిరాకరించడంతో మరో సారి గొంతుకోసి హతమార్చాడు. బాపట్ల శివారులో జరిగిన ఈ హత్య డబ్బు కోసం కొందరు ఎంతకైనా దిగజారుతారనే సత్యాన్ని చాటింది.

బాపట్ల, బాపట్ల గ్రామీణ న్యూస్‌టుడే: అడిగిన నగదు ఇవ్వలేదన్న కక్షతో ప్రైవేటు ఇంజినీర్‌ను స్నేహితుడే దారుణంగా హతమార్చిన ఘటన బాపట్ల పట్టణ శివారున జరిగింది. రైల్వే ట్రాక్‌ నిర్మాణ పనుల సంస్థలో పని చేస్తూ ఐదురోజుల క్రితం అదృశ్యమైన ఇంజినీర్‌ మృతదేహంగా మారాడు. అదే సంస్థలో పని చేస్తూ అనుమానితునిగా ఉన్న స్నేహితున్ని పోలీసులు తమదైన శైలిలో విచారించటంతో ఇది వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు.. విజయవాడ- చెన్నై మూడో రైల్వే లైన్‌ నిర్మాణ ప్రాజెక్టు పనులను జీఆర్‌ ఇన్‌ఫ్రా సంస్థ చేస్తోంది. బాపట్ల పట్టణ శివారున కేబీపాలెం రైల్వేగేటు సమీపంలోని సదరు సంస్థ ఏర్పాటు చేసిన క్యాంపులో 150 మందికి పైగా వివిధ రాష్ట్రాలకు చెందిన ఇంజినీర్లు, కార్మికులు పని చేస్తున్నారు. ఛత్తీస్‌ఘడ్‌ రాష్ట్రం భిలాయికి చెందిన యువరాజ్‌ విశ్వకర్మ (34) బాపట్ల- పొన్నూరు ప్రాంతంలో రైల్వేట్రాక్‌ నిర్మాణ పనుల ఇంజినీర్‌గా జీఆర్‌ ఇన్‌ఫ్రా సంస్థ తరఫున రెండేళ్లుగా పని చేస్తున్నాడు. పశ్చిమ బంగ రాష్ట్రం ముర్షీదాబాద్‌ డివిజన్‌ మహిషాస్థలి సమీపంలోని పటామరి గ్రామానికి చెందిన అమర్‌జీత్‌ మండల్‌ ఇదే సంస్థలో పంప్‌ ఆపరేటర్‌. విశ్వకర్మ ఇటీవలే అసిస్టెంట్‌ మేనేజర్‌గా పదోన్నతి పొందాడు.

కేసులో రాజీ కోసం నగదు కావాలని..


ప్రకాశం జిల్లా చీరాల గ్రామీణ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో అమర్‌జిత్‌ మండల్‌ ఈపూరుపాలెం వద్ద ద్విచక్ర వాహనంతో ఢీకొట్టగా వృద్ధురాలు తీవ్రంగా గాయపడి మరణించింది. ఈ ఘటనపై చీరాల పోలీసులు కేసు నమోదు చేశారు. రోడ్డు ప్రమాదం కేసు రాజీకి రూ.2 లక్షలు అవసరమైంది. రెండేళ్లుగా విశ్వకర్మ, మండల్‌ రైల్వే ట్రాక్‌ నిర్మాణ పనులు పర్యవేక్షించే క్రమంలో స్నేహితులుగా మారారు. యువరాజ్‌ వద్ద నగదు ఉందని తెలుసుకున్న మండల్‌ రూ.2 లక్షలు ఇవ్వాలని అడగగా నిరాకరించాడు. ఈ నేపథ్యంలో ఇంజినీర్‌పై పంప్‌ ఆపరేటర్‌ కోపం పెంచుకున్నాడు.

కొన ఊపిరితో ఉన్నా..

క్యాంపు కార్యాలయం నుంచి 23న సాయంత్రం ఇద్దరూ కలిసి ద్విచక్ర వాహనంపై పొన్నూరు వెళ్లి నిర్మాణ పనులు పరిశీలించి వచ్చారు. మార్గమధ్యలో భర్తిపూడి మద్యం దుకాణం వద్ద మద్యం కొని తాగారు. నల్లమడవాగు ఆర్‌అండ్‌బీ వంతెన కిందకు విశ్వకర్మను తీసుకువచ్చిన మండల్‌ నగదు ఇవ్వాలంటూ గొడవకు దిగాడు. అతను తిరస్కరించటంతో ఆగ్రహానికి గురైన మండల్‌ వెంట తెచ్చిన కత్తితో యువరాజ్‌ గొంతు కోశాడు. పర్సులో నుంచి బ్యాంకు ఏటీఎం కార్డు తీసుకుని కొన ఊపిరితో కొట్టుకుంటున్న చివరి క్షణాల్లో ఇంజినీర్‌ను పిన్‌ నంబరు చెప్పాలని మండల్‌ తీవ్ర ఒత్తిడి చేశాడు. పిన్‌ నంబరు చెప్పకపోవటంతో కత్తితో మళ్లీ గొంతు కోసి విశ్వకర్మను హత్య చేశాడు. వంతెన కింద తవ్వి మృతదేహాన్ని పాతిపెట్టాడు. మృతుని నుంచి రెండు మొబైల్‌ ఫోన్లు తీసుకుని ఒకదాన్ని పూడ్చి పెట్టి, మరొక దాన్ని వాగు నీటిలో పడేశాడు. ద్విచక్ర వాహనాన్ని తీసుకెళ్లి పొన్నూరు రైల్వే వంతెన సమీపంలో వదిలిపెట్టి ఏమీ తెలియనట్లుగా అదే రోజు రాత్రి క్యాంప్‌ కార్యాలయానికి వచ్చాడు.

పట్టించిన సీసీ పుటేజీ


యువరాజ్‌ అదృశ్యంపై జీఆర్‌ ఇన్‌ఫ్రా సంస్థ అధికారి షాజహాన్‌ 24న రాత్రి బాపట్ల గ్రామీణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో ఇంజినీర్‌తో కలిసి పంప్‌ ఆపరేటర్‌ ద్విచక్ర వాహనంపై బయటకు వెళ్లిన వీడియో పుటేజీని క్యాంపు కార్యాలయం సీసీ కెమెరాలో పరిశీలించి అనుమానంతో అమర్‌జీత్‌ మండల్‌ను సీఐ శ్రీనివాసరెడ్డి, ఎస్సై కిరణ్‌ అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల శైలిలో విచారణ చేయగా యువరాజ్‌ విశ్వకర్మను హత్య చేసిన విషయాన్ని సీఐ, ఎస్సైలకు నిందితుడు తెలియజేశాడు. నల్లమడ వాగు వంతెన వద్ద మృతదేహాన్ని పాతిపెట్టిన ప్రాంతంలో పోలీసులు తవ్వించి బయటకు తీయించారు. ఘటనా స్థలాన్ని డీఎస్పీ శ్రీనివాసరావు సందర్శించి హత్య జరిగిన తీరు పరిశీలించారు. హత్య కేసు నమోదు చేసి మండల్‌ను అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపరిచినట్లు డీఎస్పీ తెలిపారు.

Post a Comment

Previous Post Next Post