కథానాయికలతో లావాదేవీలు
వివాదాస్పద స్వామితో మాకెలాంటి సంబంధం లేదని హోం మంత్రి బసవరాజ బొమ్మై, కేంద్ర మంత్రి ప్రహ్లాద జోషి, ఉప ముఖ్యమంత్రి లక్ష్మణ సవది తదితరులు ఇప్పటికే స్పష్టం చేశారు. పనుల కోసం నేతల వద్దకు వచ్చే వారు ఫొటోలు తీయించుకుంటారని, వాటిని అడ్డుపెట్టుకుని వంచనలకు పాల్పడేవారితో జాగ్రత్తగా ఉండాలని బొమ్మై హెచ్చరించారు.
బెంగళూరు (సదాశివనగర), న్యూస్‌టుడే : వివాదాల్లో చిక్కుకున్న బహుభాషా నటి రాధికా కుమారస్వామి అజ్ఞాతవాసంలోకి వెళ్లిపోయింది. బెంగళూరు నేర నియంత్రణ దళం (సీసీబీ) అధికారుల ఎదుట విచారణకు హాజరైన ఆమె.. శుక్రవారం రాత్రి నుంచి కనిపించడం లేదనే సమాచారం గుప్పుమంది. తన సోదరుడు రవిరాజ్‌తో కలిసి ఆమె శుక్రవారం విచారణకు హాజరయ్యారు. తమకు తెలియజేయకుండా నగరం విడిచి వెళ్లకూడదని అధికారులు ఆమెకు సూచించారు. నగరంలోనే తనకు పరిచయం ఉన్న వారి నివాసంలో ఆమె విశ్రాంతి తీసుకుంటున్నట్లు సమాచారం. రాధికా కుమారస్వామిని ఇబ్బంది పెట్టేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని మండ్య జిల్లాకు చెందిన వెంకటేశ్ అనే అభిమాని ఆక్రోశించారు. ఆమె ఎదుర్కొంటున్న అన్ని సమస్యలూ దూరం కావాలని కోరుకుంటూ మైసూరు చాముండి బెట్టపై శనివారం పొర్లు దండాలు పెట్టి, పూజలు చేశారు. మాజీ మంత్రి మురుగేశ్ నిరాణిని ఆమె కలిసినట్లు ఉన్న చిత్రాలు ఇప్పుడు వైరల్ అయ్యాయి. అవి పాత చిత్రాలని, ఆమెకు రూ.15 లక్షల నగదు బదిలీ చేసిన స్వామే మాజీ మంత్రిని రాధికకు పరిచయం చేశారని పోలీసులు అనుమానిస్తున్నారు.
బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే : భాజపా, ఆర్‌ఎస్‌ఎస్ ప్రముఖ నాయకులతో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ప్రచారం చేసుకుంటూ శ్రీమంతుల నుంచి నగదు వసూళ్లకు పాల్పడిన యువరాజ్ అలియాస్ స్వామి సేవాలాల్ అరెస్టు అనంతరం.. విచారణలో ఆసక్తికర అంశాలు వెలుగు చూస్తున్నాయి. భారీ బడ్జెట్, పెద్ద ప్రొడక్షన్‌లలో నటించే అవకాశం ఇప్పిస్తానని ఎనిమిది మంది యువ కథానాయికలు, ఇద్దరు స్టార్ హీరోయిన్లను పలుసార్లు కలుసుకున్నట్లు గుర్తించారు. వారందరితో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అనుమానిస్తున్నారు. ఆ కథానాయికలను ముందుంచుకుని రాజకీయ నాయకులు, శ్రీమంతులతో వంచన వ్యూహాలు రూపొందించారని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుని 47 బ్యాంకు ఖాతాల పరిశీలన ప్రక్రియ ప్రారంభిస్తే ఎవరి ఖాతాలకు నగదు బదిలీ అయ్యిందో తెలుసుకోవడం మరింత సులువు కానుంది. జ్యోతిషం చెబుతానని ఎక్కువ మందిని నమ్మించిన స్వామి పలువురు దర్శకులు, నిర్మాతలు, కళాకారులను వంచించాడని కాల్‌డేటా ఆధారంగా గుర్తించారు. తన ఖాతాలతో పాటు, తన బినామీ ఖాతాల నుంచీ కథానాయికల ఖాతాలకు నగదు బదిలీ అయిందని తెలుసుకున్నారు.
సినిమా పేరిట వంచన
తనకు రూ.పది లక్షలు ఇస్తే సినిమా తీసేందుకు రూ.70 లక్షలు ఇప్పిస్తానని స్వామి తనను వంచించాడని చిత్ర నిర్మాత సహదేవ్ ఆరోపించారు. తన నుంచి నగదు తీసుకుని, ఆ తరువాత ముఖం చాటేశాడని ఉప్పారపేట పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశారు. విచారణ తీవ్రమైతే పలువురు కథానాయికలు, రాజకీయ నాయకుల జాతకాలు బయటపడే అవకాశం ఉంది.