మరణాన్ని జయించాడు.. అందర్నీ మెప్పించాడు!


వేదికపై నోటితోనే చిరంజీవి చిత్రం గీసి ప్రశంసలు

మరణాన్ని జయించాడు.. అందర్నీ మెప్పించాడు!

సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం కంకోల్‌ గ్రామానికి చెందిన తుల్జారాం, ప్రమీల దంపతుల నాలుగో సంతానం మధుకుమార్‌. పదకొండేళ్ల ఈ బాలుడు గతేడాది సెప్టెంబరులో విద్యుదాఘాతానికి గురై తీవ్రంగా గాయపడ్డాడు. ప్రాణాలు దక్కవని వైద్యులు తేల్చిచెప్పడంతో తల్లిదండ్రులు ఆసుపత్రి నుంచి ఇంటికి తీసుకొచ్చేశారు. స్థానిక ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు చిన్నారిని తిరిగి గాంధీ ఆస్పత్రిలో చేర్పించేలా చొరవచూపారు. అక్కడి వైద్యులు చికిత్స అనంతరం బాలుడి రెండు చేతులు పూర్తిగా, కాళ్లలో ఒకదాన్ని పూర్తిగా, మరోదాన్ని పాక్షికంగా తొలగించారు. ఇంటికొచ్చిన తర్వాత కొన్ని నెలలపాటు మంచానికే పరిమితమైన అతని దయనీయ స్థితిని ‘ఈనాడు-ఈటీవీ’ వెలుగులోకి తేవడంతో మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి, కలెక్టరు హనుమంతరావు స్పందించారు. తామంతా అండగా ఉంటామని ప్రకటించారు. విన్నర్స్‌ ఫౌండేషన్‌ అధ్యక్షుడు రఘు అరికెపూడి బాలుడికి నోటితో చిత్రాలు గీయించడం నేర్పించాలని నిర్ణయించి,  చిత్రకారుడు సముద్రాల హర్ష సాయం తీసుకున్నారు. ఫౌండేషన్‌ కృషి, దాతలిచ్చిన ధైర్యంతో బతుకుపై ఆశ పెంచుకున్న కుర్రాడు క్రమంగా కోలుకున్నాడు. నృత్యం చేయడం, నాలుకతో బొమ్మలు గీయడంలో ప్రావీణ్యం సాధించాడు. ఏడాదికాలంలోనే ఇతరుల్లో స్ఫూర్తి నింపే స్థాయికి చేరాడు. సినీ నటి సమంత నిర్వహించే ‘సామ్‌ జామ్‌’ షోకు ఇటీవల హాజరైన మధుకుమార్‌ సినీ నటుడు చిరంజీవినీ మెప్పించాడు. ఆయన చిత్రాన్ని వేదికపైనే గీసి ప్రశంసలు అందుకున్నాడు. భవిష్యత్తులో గొప్ప పేరు తెచ్చుకొని అందరికీ స్ఫూర్తిగా నిలుస్తానని ధీమాగా చెబుతున్నాడు.

మరణాన్ని జయించాడు.. అందర్నీ మెప్పించాడు!


Post a Comment

Previous Post Next Post