గుంటూరు: గుంటూరు నగరంలోని జీజీహెచ్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆస్పత్రిలోని కొవిడ్ రోగులను ఉంచే ఐసీయూ వార్డులో మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు.. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. అగ్నిప్రమాదం సమయంలో 15మంది కరోనా రోగులు, ఐదుగురు డయాలసిస్ రోగులు ఉన్నట్టు సమాచారం. ఆస్పత్రి రెండో అంతస్తులోని ఐసీయూ వార్డు నుంచి వారిని సురక్షితంగా బయటకు తరలించారు. మొదట మంటలు చెలరేగగానే అవినాష్ అనే యువకుడు అగ్నిమాపక పరికరంతో అదుపులోకి తెచ్చాడు. నాట్కో క్యాన్సర్ ఆసుపత్రిలో అవినాష్ పొరుగు సేవల ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నాడు. సకాలంలో స్పందించి మంటలను ఆర్పివేసిన అవినాష్‌ను జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి అభినందించారు. ఘటనా స్థలాన్ని ఎస్పీ అమ్మిరెడ్డితో పాటు ఎమ్మెల్యే షేక్ ముస్తఫా, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి పరిశీలించారు.