చికిత్స అనంతరం కోలుకున్న చిన్నారితో తల్లి
తిరువూరు, న్యూస్‌టుడే: సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా ఉండే ప్రముఖ సినీ నటుడు సోనూసూద్ చిన్నారి గుండె శస్త్రచికిత్సకు సాయం అందించి మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. మండలంలోని మునుకుళ్లకు చెందిన కొంగల వెంకటేశ్వర్లు, సరస్వతి దంపతులకు 15 నెలల వయసున్న కుమార్తె వర్షిత గుండె సంబంధిత సమస్యతో బాధపడుతుంది. నిరుపేద కుటుంబానికి చెందిన వారు కావడంతో కుమార్తెకు చికిత్స చేయించలేని పరిస్థితుల్లో దాతల సాయం కోసం ప్రార్థించారు. జనవిజ్ఞాన వేదిక ప్రతినిధులు ఎం.హరికృష్ణ, ఎల్.గంగాధర్, కె.పాపారావు, డి.సుదర్శన్, ఎం.రాంప్రదీప్ సామాజిక మాధ్యమాల ద్వారా చిన్నారి పరిస్థితిని సోనూసూద్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన స్పందించారు. ముంబయిలోని ఆస్పత్రిలో శస్త్రచికిత్స చేయడానికి అవసరమైన రూ.4.50 లక్షల సాయం అందించారు. చికిత్స అనంతరం కోలుకున్న చిన్నారి తల్లిదండ్రులతో కలిసి సోమవారం మునుకుళ్ల చేరుకుంది. ఈసందర్భంగా సోనూసూద్‌కు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.