అడ్డుగా ఉన్నాడని.. అంతమొందించారు

ప్రియుడి మోజులో భర్త హత్యకు ప్రణాళిక కత్తితో పొడిచి చంపిన వైనం ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు

అడ్డుగా ఉన్నాడని.. అంతమొందించారు..!


వివరాలను వెల్లడిస్తున్న సీఐ చంద్రశేఖర్‌

కొత్తూరు, న్యూస్‌టుడే: కట్టుకున్న భార్యే యముడైంది.. తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించి ప్రియుడితో కలిసి భర్తనే కడతేర్చింది. పక్కాగా ప్రణాళిక రచించి ఈ పన్నాగానికి ఒడిగట్టింది..ఏమీ తెలియదన్నట్లు నటించి చివరికి అడ్డంగా దొరికిపోయి కటకటాలపాలైంది. ఇటు తండ్రి మృతి, అటు తల్లి జైలుపాలు కావడంతో వీరి బిడ్డలు ఎవరూ లేనివారయ్యారు. ఈనెల 25న భామిని మండలం దిమ్మిడిజోల గ్రామ సమీపంలోని ఏబీ రోడ్డు వద్ద జరిగిన హత్య కేసుని పోలీసులు ఛేదించారు. ఇందుకు సంబంధించిన వివరాలను సీఐ చంద్రశేఖర్‌, బత్తిలి ఎస్సై కె.వి.సురేష్‌ శుక్రవారం వెల్లడించారు.

* నేరడి(బి) పంచాయతీ లోహరిజోల గ్రామానికి చెందిన కుమారస్వామి దంపతులకు ఇద్దరు పిల్లలు. ఇతని భార్యకు వివాహం కాకముందే పాతపట్నం మండలం గంగువాడ గ్రామానికి చెందిన పి.హేమంత్‌కుమార్‌ అనే వ్యక్తితో సంబంధం ఉంది. కులాలు వేరుకావడంతో ఇద్దరూ వేర్వేరు వివాహాలు చేసుకున్నారు. అయినా వీరిమధ్య వివాహేతర సంబంధం కొనసాగుతుండేది. దీన్ని గమనించిన భర్త కుమారస్వామి హెచ్చరించడంతో ఎలాగైనా అతని అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకొని ఓ పథకం రచించారు. ఈ నెల 25న లోహరిజోల నుంచి కుమారస్వామి భార్యాపిల్లలతో కలిసి ద్విచక్ర వాహనంపై బంధువుల ఇంటికి బయలుదేరారు. అప్పటికే హేమంత్‌కు సమాచారం అందించడంతో వీరి వాహనాన్ని నేరడి గ్రామం నుంచే అనుసరించాడు. వీరి వాహనం దిమ్మిడిజోల దగ్గరికి వచ్చేసరికి జనసంచారం లేకపోవడంతో హేమంత్‌ తన వెంట తెచ్చుకొన్న కత్తితో కుమారస్వామిని పొడిచి పరారయ్యాడు.

నిందితుల్ని పట్టించిన చరవాణి.. హత్య జరిగిన వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని కుమారస్వామి భార్య ని విచారించారు. ఆమె ఇచ్చిన సమాధానాలు అనుమానాలకు తావివ్వడంతో పాటు, గ్రామంలో విచారించడంతో ఆమె అక్రమ సంబంధం బయట పడింది. దీంతో పోలీసుల పని సులువైంది. కుమారస్వామి భార్య, నిందితుడు హేమంత్‌కుమార్‌ చరవాణులను స్వాధీనం చేసుకొని, కాల్‌డేటా ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులు వారేనని గుర్తించారు. ఇద్దరినీ అరెస్టు చేసి పాలకొండ కోర్టుకు తరలించినట్లు సీఐ పేర్కొన్నారు.

Post a Comment

Previous Post Next Post