అటవీ ప్రాంతంలో ఉరేసుకొని అఘాయిత్యం

షాపూర్‌నగర్, న్యూస్‌టుడే: వారిద్దరూ ప్రాణస్నేహితులు కలిసి చదువుకొన్నారు.. వేర్వేరు చోట్ల పనిచేస్తున్నారు. పని ముగించుకొని తరచూ కలుసుకొనేవారు. రెండు రోజుల కిందట ఇంటి నుంచి వెళ్లిన వీరు గుర్తు తెలియని కారణాలతో చెట్టుకు ఉరేసుకొని తనువు చాలించారు. వీరి మృతికి కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గాజులరామారం గ్రామానికి చెందిన బండోజి సత్యనారాయణ, పద్మ దంపతులకు ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు సాయికుమార్(22) ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. సంజయ్‌గాంధీనగర్ నివాసి కైలాష్, వెంకటమ్మ దంపతులకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు. కుమారుడు నరేష్(22) ఫ్యాబ్రికేషన్ పని చేస్తున్నాడు. సాయికుమార్, నరేష్ ఎనిమిదో తరగతి వరకు కలిసి చదువుకొన్నారు. చదువుపై ఆసక్తి లేక ఇద్దరూ చదువు మానేసి వేర్వేరు పనుల్లో ఉపాధి చూసుకొన్నారు. ఈ నెల 10న ఇద్దరూ సాయంత్రం విధులు ముగించుకొన్న తర్వాత ఇంటి నుంచి బయటకు వెళ్లారు. అనంతరం ఇద్దరి ఫోన్‌లు స్విచ్ఛాఫ్ చేసుకున్నారు. సాయికుమార్ కుటుంబసభ్యులు ఈ నెల 11న జీడిమెట్ల పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదైంది. పోలీసులు జరిపిన దర్యాప్తులో ఇద్దరూ కలిసి ఆదివారం వికారాబాద్ వెళ్లి అనుమానాస్పదంగా తిరుగుతుండగా పోలీసులు అనుమానంతో అదుపులోకి తీసుకొని విచారించగా గుర్తింపు కార్డులు చూపించడంతో వదిలేసినట్లు తెలిసింది. అనంతరం వీరు వికారాబాద్‌లో నరేష్ బంధువుల ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో నరేష్ తల్లి ఫోన్ చేయగా అరగంటలో ఇంటికి వస్తానని చెప్పి ఫోన్ స్విచ్ఛాఫ్ చేశాడు. బంధువుల ఇంటికి కూడా వెళ్లడంతో తిరిగి వస్తారని రెండు కుటుంబాల వారు భావించారు. లాల్‌సాబ్‌గూడలోని అటవీప్రాంతంలో ఇద్దరు పక్కపక్కనే ఉన్న చెట్లకు ఉరేసుకొని మృతిచెంది ఉన్నట్లు మంగళవారం సాయంత్రం జీడిమెట్ల పోలీసులకు సమాచారం అందడంతో వారు అక్కడికి చేరుకొని పరిశీలించి, తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించారు. వీరి మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఇద్దరికీ ఎటువంటి ఆర్థిక, అనారోగ్య ఇబ్బందులు లేవని ఎందుకు ఇంటి నుంచి వెళ్లారో.. ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారో అర్థం కావడం లేదని కుటుంబసభ్యులు అంటున్నారు.