తాడికొండ (గ్రామీణ మంగళగిరి), న్యూస్‌టుడే: తాడికొండ మండలం పొన్నెకల్లులో వృద్ధురాలు అన్నపురెడ్డి విజయలక్ష్మి (63) హత్య కేసులో నిందితుడైన మేనల్లుడు పప్పుల లింగారెడ్డిని సీఐ శేషగిరిరావు గురువారం అరెస్టు చేశారు. వివరాలను డీఎస్పీ దుర్గాప్రసాద్, సీఐ శేషగిరిరావు కలిసి తెలిపారు. అన్నపురెడ్డి విజయలక్ష్మి, మల్లారెడ్డి దంపతులకు సంతానం లేరు. మల్లారెడ్డి 9 నెలల క్రితం చనిపోయాడు. ఆయన అన్న కొడుకు అన్నపురెడ్డి శ్రీనివాసరెడ్డి తలకొరివి పెట్టి అంతిమ సంస్కారాలు జరపడంతో విజయలక్ష్మి తన ఇంటిని అతడికి గిఫ్ట్ డీడ్‌గా రాసి ఇచ్చారు. రెండు నెలల క్రితం తాను ఇల్లు కట్టుకుంటున్నానని, అప్పటివరకు మేనత్త ఇంట్లో ఓ భాగంలో ఉంటానని పప్పుల లింగారెడ్డి వచ్చి ఉంటున్నారు. ఇదిలా ఉండగా డిసెంబర్ 1న విజయలక్ష్మి తన ఎకరం పొలాన్ని అమ్మేందుకు ఒకరి వద్ద బేరం కుదుర్చుకొని అడ్వాన్సుగా రూ.3 లక్షలు తీసుకున్నారు. అందులో రూ.2 లక్షలు తన అక్క, వారి పిల్లలకు ఇస్తానని బంధువులకు చెప్పారు. దీనిపై లింగారెడ్డి ఆమెతో గొడవపడ్డాడు. వారం రోజుల క్రితం అతడి భార్య పుట్టింటికి వెళ్లింది. ఈనెల 19న ఇంటి వరండాలో నిద్రిస్తున్న విజయలక్ష్మి గొంతుకు బెల్టు వేసి బిగించి చంపేశాడు. 20న ఉదయం విజయలక్ష్మి అక్క కూతురు, మనవడు వచ్చి చూడగా మరణించి కనిపించారు. అన్నపురెడ్డి శ్రీనివాసరెడ్డి తాడికొండ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు నిందితుడు లింగారెడ్డిని అదుపులో తీసుకుని విచారించగా హత్య చేసినట్లు అంగీకరించాడు. 2009లో జరిగిన రెండు హత్య కేసుల్లో లింగారెడ్డి జైలు శిక్ష అనుభవించాడని, అతడిపై రౌడీషీట్ తెరిచినట్లు డీఎస్పీ దుర్గాప్రసాద్ వివరించారు.