నమ్మితే అత్యాచారం చేశాడు


ఆపై తలపై మోది.. జననాంగాన్ని గాయపరిచి హత్యాయత్నం
హైదరాబాద్‌లో మహిళపై ఘాతుకం
ఆలస్యంగా వెలుగుచూసిన ఘటన


మూసాపేట, న్యూస్‌టుడే: తెలిసినవాడే కదా అని నమ్మి అతని వెంట వెళ్లినందుకు ఓ మహిళను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి ఒడిగట్టాడు. ఆపై బండరాయితో ఆమె తలపై మోది అంతమొందించాలని ప్రయత్నించాడు. ఆమె జననాంగాన్ని సైతం తీవ్రంగా గాయపరిచి పరారయ్యాడు. అపస్మారకస్థితికి చేరుకున్న బాధితురాలు రాత్రంతా ఘటనా స్థలంలోనే అచేతనంగా పడి ఉంది. మరుసటి రోజున మెలకువ వచ్చి సమీపంలోని పుట్టింటికి పాక్కుంటూ వెళ్లింది. హైదరాబాద్‌ కూకట్‌పల్లి ఠాణా పరిధిలో చోటుచేసుకున్న ఈ దారుణం ఆలస్యంగా వెలుగుచూసింది.

పోలీసులు, బాధితురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ మహిళ (50) భర్తతో విభేదించి విడిగా తన తల్లితో కలిసి మూసాపేటలో ఉంటోంది. స్థానికంగా కూలి పనిచేసుకుంటూ జీవిస్తోంది. గతంలో మూసాపేట యాదవబస్తీలో ఉన్నప్పుడు పక్కింట్లో ఉండే సెంట్రింగ్‌ మేస్త్రీ లుకలాపు రాము (38)తో పరిచయం ఏర్పడింది. ఆమె ప్రతిరోజూ కూలికి వెళ్లి ఇంటికి తిరిగివచ్చేటప్పుడు మూసాపేట నుంచి నడిచివెళ్లేది. ఈ విషయం తెలుసుకున్న రాము శుక్రవారం సాయంత్రం ఆమెను మూసాపేట నర్సింహస్వామి ఆలయం వద్ద ఆపి.. ‘నేను కూడా మీ ఇంటి వైపే వెళ్తున్నాను.. నా ద్విచక్ర వాహనంపై తీసుకెళ్తాను’ అని నమ్మించాడు. తెలిసినవాడు కావడంతో ఆమె నమ్మి అతని ద్విచక్ర వాహనంపై ఎక్కింది. రాఘవేంద్ర సొసైటీని ఆనుకుని ఉన్న చెట్ల పొదల్లోకి ఆమెను బలవంతంగా తీసుకెళ్లి రాము అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం బండరాయితో ఆమె తలపై కొట్టడంతో ముఖానికి బలమైన గాయాలయ్యాయి. కనుగుడ్డు చిట్లిపోయినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఆమె జననాంగాన్ని తీవ్రంగా గాయపరిచాడు. బాధితురాలు చనిపోయిందనుకుని అక్కడి నుంచి పరారయ్యాడు.

తీవ్ర రక్తస్రావానికి గురైన ఆమె అపస్మారకస్థితిలోకి చేరుకుంది. శనివారం ఉదయం మెలకువ వచ్చాక చూస్తే.. తన ఒంటిపై దుస్తులు సరిగా లేకపోవడంతో లోదుస్తులతోనే సమీపంలోని తమ ఇంటికి పాక్కుంటూ వెళ్లింది. తల్లి సాయంతో పోలీసులకు సమాచారం ఇవ్వగా.. 108లో బాధితురాలిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ప్రాణాపాయ స్థితిలో ఉందని వైద్యులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న నిందితుడు రాము కుటుంబ సభ్యులు సహా పరారయ్యాడు. అతని కోసం కూకట్‌పల్లి పోలీసులు గాలిస్తున్నారు. నిందితుడి స్వగ్రామం శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం కొసమాల. 15 ఏళ్ల క్రితం నగరానికి వచ్చి మూసాపేటలో ఉంటున్నాడు. బాధితురాలిపై అత్యాచారయత్నం అతనొక్కడే చేశాడా.. ఇంకెవరైనా ఉన్నారా.. తేలాల్సి ఉంది. ఒక్కడే ఉండి ఉంటాడని పోలీసులు చెబుతుండగా.. తన మిత్రులను ముందుగానే రప్పించి ఉంటాడని బాధితురాలి బంధువులు పేర్కొంటున్నారు.

Post a Comment

Previous Post Next Post