మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా జవహర్‌నగర్‌లో ఘటన
ANW - హైదరాబాద్, న్యూస్‌టుడే- జవహర్‌నగర్, రెజిమెంటల్‌బజార్: ప్రభుత్వ భూముల్లో ఆక్రమణల తొలగింపు తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. స్థానిక పోలీస్ ఇన్‌స్పెక్టర్, మున్సిపల్ కమిషనర్, రెవెన్యూ సిబ్బందిపై ఆక్రమణదారులు దాడికి యత్నించడం సంచలనం సృష్టించింది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా జవహర్‌నగర్ నగరపాలక సంస్థ పరిధిలో గురువారం జరిగిన ఈ ఘటనలో సీఐ భిక్షపతిరావుకు మంటలంటుకుని తీవ్ర గాయాలయ్యాయి. జవహర్‌నగర్ కార్పొరేషన్‌లో రెవెన్యూ అధికారులు ఈ ఏడాది ఫిబ్రవరి 27న క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజావసరాల కోసం అవసరమైన ప్రభుత్వ భూమిని గుర్తించారు. బాలాజీనగర్‌లోని సర్వే నంబర్లు 432లో 1500 గజాలు, 495లో 510 గజాలను ఆధునిక మరుగుదొడ్ల కోసం కేటాయించారు. సెప్టెంబరులో అప్పటి మున్సిపల్ కమిషనర్, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఇప్పటికీ పనులు ప్రారంభం కాలేదు. ఈ క్రమంలో కొందరు వ్యక్తులు ఈ భూములను కబ్జా చేసి పూనమ్‌చంద్ అనే వ్యక్తికి విక్రయించారు. అతను 20 రోజుల కిందట ఓ గదిని నిర్మించాడు. ఈ విషయమై 19న మున్సిపల్ కమిషనర్ మంగమ్మ జవహర్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ భిక్షపతిరావు దర్యాప్తు ప్రారంభించారు.
ఆత్మహత్య చేసుకుంటామంటూ బెదిరింపులు
అక్రమ నిర్మాణాలను కూల్చేందుకు కాప్రా తహసీల్దార్ గౌతమ్‌కుమార్, కమిషనర్ మంగమ్మ జవహర్‌నగర్ పోలీసుల సహకారంతో గురువారం రంగంలోకి దిగారు. కూల్చివేతల ప్రారంభానికి ముందే ఆక్రమణదారులు అధికారులపై కారం చల్లడంతో ఉద్రిక్తతకు దారి తీసింది. తమ ఇంటిని కూల్చేస్తే ఆత్మహత్య చేసుకుంటామంటూ పూనమ్‌చంద్, కుటుంబ సభ్యురాలు శాంతిదేవి, నిహాల్‌చంద్, నిర్మలలు అక్కడ నిర్మించిన గదిలోకి పెట్రోలు డబ్బాతో వెళ్లి గడియ పెట్టుకున్నారు. వెంటనే పోలీసులు సీఐ భిక్షపతిరావుకు సమాచారమిచ్చారు. ఆయన సాయంత్రం 5 గంటల సమయంలో ఘటనాస్థలికి చేరుకున్నారు. ఆ సమయంలో గది నుంచి పొగలు వస్తుండటంతో వారిని రక్షించేందుకు ముందుకెళ్లారు. సీఐ ఎంత నచ్చచెప్పినా బయటికొచ్చేందుకు పూనమ్‌చంద్ తదితరులు ససేమిరా అన్నారు. దాంతో తలుపు విరగొట్టే ప్రయత్నం చేయగా.. లోపలున్న వ్యక్తులు తలుపులు తీసి అక్కడున్నవారిపై పెట్రోలు చల్లి అంటించేందుకు యత్నించారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న సీఐ భిక్షపతిరావు తలుపును గట్టిగా తన్నడంతో విరిగిపోయింది. ఎగసిపడుతున్న మంటలు ఒక్కసారిగా ఆయన చేతులు, కాళ్లకు అంటుకుని తీవ్ర గాయాలయ్యాయి. ఆయన్ను సికింద్రాబాద్‌లోని యశోద ఆసుపత్రికి తీసుకెళ్లారు. డీజీపీ మహేందర్‌రెడ్డి, రాచకొండ సీపీ మహేశ్ ఎం.భగవత్, ఇతర ఉన్నతాధికారులు సీఐను పరామర్శించారు. ‘‘40 శాతం నుంచి 50 శాతం వరకు గాయాలయ్యాయి. మెరుగైన వైద్యం అందిస్తాం. సీఐకి అండగా ఉంటాం. పూనమ్‌చంద్, శాంతిదేవిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నాం. ఈ ఘటన ఉద్దేశపూర్వకంగా జరిగిందా లేదా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నాం. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం’’ అని సీపీ మహేశ్ భగవత్ తెలిపారు.