రూ.20 లక్షల విలువైన వధువు నగలు చోరీ
డిచ్‌పల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: అంతా పెళ్లి కోలాహలంలో ఉన్నారు.. బంధుమిత్రులు ఒకరినొకరు పలుకరించుకుంటూ హడావిడిగా ఉన్నారు. అదే సమయంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు పెళ్లికి వచ్చిన బంధువుల్లా ముందు వరుసలో దర్జాగా కూర్చున్నారు. అదను చూసి రూ.20 లక్షల విలువైన పెళ్లి కుమార్తె నగలను తస్కరించి చల్లగా జారుకున్నారు.. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం బర్దీపూర్ శివారులోని ఓ ఫంక్షన్‌హాల్‌లో బుధవారం జరిగింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా పారెపల్లి వీధికి చెందిన గట్టు ఫణీంద్రకు, మహారాష్ట్రలోని ఉమ్రి తాలుకాకు చెందిన కావ్యతో వివాహం నిశ్చయమైంది. ఇద్దరి కుటుంబాలకు దగ్గరవుతుందని మధ్యనున్న డిచ్‌పల్లి మండలం బర్దీపూర్ శివారులోని కల్యాణ మండపంలో నిర్వహించారు. పెళ్లి జరుగుతుండగా ఇద్దరు గుర్తు తెలియని యువకులు వచ్చారు. గంటపాటు వేదిక పైకి, కిందకు వెళ్తూ పరిస్థితులను గమనించారు. పెళ్లి తంతు తర్వాత వధూవరులకు అక్షింతలు వేసే సమయంలో పెళ్లికుమార్తె బంగారు ఆభరణాల్లో కొన్నింటిని తీసి పక్కనే ఉన్న సమీప బంధువు బ్యాగులో ఉంచారు. అందరు హడావుడిగా ఉన్న సమయంలో ఒక వ్యక్తి వెళ్లి నగలను పర్యవేక్షిస్తున్న మహిళ దృష్టి మరల్చాడు. ఆమె వెనక్కి తిరిగి చూసేలోపు మరో దొంగ చేతివాటం ప్రదర్శించి బ్యాగును తస్కరించాడు. ఇద్దరూ కలిసి నగలతో పారిపోయారు. ఈ మేరకు పెళ్లికొడుకు తండ్రి గట్టు నాగకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏసీపీ శ్రీనివాస్‌రావు, సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై సురేష్‌కుమార్ మండపాన్ని పరిశీలించారు. సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించి దొంగలను గుర్తించినట్లు సమాచారం