చెన్నై: తమిళనాడుకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి రియాస్దీన్ షంషుద్దీన్ తయారుచేసిన తేలికైన ఎఫ్‌ఈఎంటీవో శాటిలైట్‌ను నాసా తన తరువాతి ప్రయోగంలో ఉపయోగించనున్నట్లు తెలిపింది. ఎంతో మంది పంపిన నమూనా శాటిలైట్లలో రియాస్దీన్ శాటిలైట్‌ను నాసా ఎంచుకుంది. దీనిని 2021లో తదుపరి ప్రయోగంలో ఉపయోగించనున్నట్లు నాసా తెలిపింది. తిరుచ్చికి చెందిన రియాస్దీన్ ఇంజనీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఫెమ్‌టో శాటిలైట్ అయిన వీటికి విజన్ శాట్ వి1, వి2 అని పేరు పెట్టాడు. ఇది వంద గ్రాములకన్నా తక్కువ బరువుతో, చౌకగా తయారుచేశానని రియాస్దీన్ తెలిపాడు. ఈ శాటిలైట్ 11 సెన్సార్లతో ఉంటుందన్నాడు. దీని ఆధారంగా మైక్రోగ్రావిటీపై పరిశోధనలు చేయొచ్చని తెలిపాడు. ‘‘ఇప్పటివరకూ బంగారం, టైటానియం లోహాలతో ఉపగ్రహాల్లోని ముఖ్య భాగాలను తయారు చేస్తున్నాం. వాటి స్థానాల్లో పాలిథిరిమైడ్ ఎంత ప్రభావవంతంగా పనిచేస్తుందో చూసేందుకు ప్రయత్నించాను. దీంతో దీన్ని మరింత చౌకగా తయారుచేసేందుకు అవకాశం లభించింది.’’ అని తెలిపాడు. నివేదికల ప్రకారం రియాస్దీన్ శాటిలైట్ వి1ను వచ్చే ఏడాది జూన్‌లో వర్జీనియా నుంచి నాసా ప్రయోగించనున్న ఎస్‌ఆర్-7 రాకెట్ మిషన్‌లో ఉపయోగించనున్నారు. అదే ఏడాది ఆగస్టులో ప్రయోగించనున్న నాసా బలూన్ మిషన్ ఆర్‌బి-6లో వి2 శాటిలైట్‌ను వినియోగించనున్నారు. రియాస్దీన్ తన ప్రతిభతో తమిళనాడు, భారత్‌ను గర్వపడేలా చేశాడని డీఎంకే అగ్రనేత స్టాలిన్ అభినందించారు.
తేలికైన ఉపగ్రహాన్ని తయారుచేసిన విద్యార్థి