చెల్లీ.. వెళ్లొస్తానమ్మా!


 సోదరి జన్మదిన సందర్భంగా దుర్ఘటన కేకు తెచ్చేందుకు వెళ్లిన అన్నయ్య దుర్మరణం

రాహుల్‌ ప్రజాపతి

మల్లాపూర్‌, న్యూస్‌టుడే: చెల్లి పుట్టిన రోజు కావడంతో కేకుతోపాటు బిర్యానీ తీసుకొస్తానని సోదరి వీణకు అన్న రాహుల్‌(26) చెప్పిన ఆ మాటలు.. ఆఖరి క్షణాలుగా మారాయి. 20 ఏళ్ల కిత్రం బిహార్‌ నుంచి ఆ కుటుంబం వలస వచ్చి మల్లాపూర్‌లో స్థిరపడింది . ఆదివారం చెల్లెలు పుట్టినరోజు కావడంతో సాయంత్రం స్నేహితుడితో ఈసీఐఎల్‌ వెళ్లాడు అక్కడ మిగిలిన మిత్రులతో టీ తాగి, తన స్నేహితుని కొత్త బైక్‌ను ఒకసారి ట్రయల్‌ వేద్దామని తీసుకున్నాడు. అర కిలోమీటరు వెళ్లగానే ద్విచక్ర వాహనం అదుపు తప్పి ఏఎస్‌రావుగనర్‌-ఈసీఐఎల్‌ ప్రధాన రహదారిలో కమలానగర్‌ వద్ద విద్యుత్తు స్తంభాన్ని ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. తండ్రి ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తూ తన ముగ్గురి పిల్లలను చదివిస్తున్నాడు. ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన రాహుల్‌ రెండేళ్లుగా చర్లపల్లి పారిశ్రామికవాడలోని ఓ ఇంజినీరింగ్‌ వర్క్స్‌ పరిశ్రమలో పనిచేస్తూ ఇంటికి ఆసరగా నిలుస్తున్నాడు.

అంకుర సంస్థ ఆశలు ఆవిరి..

చిన్నప్పటి నుంచి సొంతగా ఎదగాలని కలలు కన్నాడు. ఇంజినీరింగ్‌ పూర్తి చేయగానే పరిశ్రమలో పనిచేస్తూనే వ్యాపార మెలకువలు నేర్చుకుంటున్నాడు. గత మూడు నెలలుగా పరిశ్రమ స్థాపించే పనిలో నిమగ్నమయ్యాడు. చర్లపల్లి పారిశ్రామికవాడలోని ఓ పరిశ్రమను లీజ్‌కు తీసుకునే ప్రయత్నంలోనే ప్రమాదం చోటు చేసుకుంది. అంకురసంస్థ స్థాపించి తనతోపాటు మరో పది కుటుంబాలకు ఉపాధి ఇవ్వాలన్న ఆశలు ఆవిరైపోయాయంటూ తల్లిదండ్రులు రోదనలు మిన్నంటాయి. ఇదే ప్రమాదంలో రాహుల్‌ వెనకాల కూర్చున్న మల్లాపూర్‌ డివిజన్‌కు చెందిన మనీష్‌(26)కి తీవ్రగాయాలయ్యాయని ఎస్సై మదన్‌లాల్‌ తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది.

Post a Comment

Previous Post Next Post