ఆగని మనీ యాప్‌ల వేధింపులు


రూ.60 వేలకు రూ.3 లక్షలు వసూలు మరో రూ.4.50 లక్షలు కట్టాలంటూ ఒత్తిడి ఊరి వదిలి వెళ్లిన ఉపాధ్యాయుడు భార్య చొరవతో అర్బన్‌ ఎస్పీకి ఫిర్యాదు


మరో బాధితుడు యువకుడు

ఆగని మనీ యాప్‌ల వేధింపులు

ఫిర్యాదు చేసిన యువకుడు

గుంటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే : మనీ యాప్‌లలో నగదు తీసుకోవడంతో వేధింపులు అధికమయ్యాయని, వారి బెదిరింపులు తాళలేక ఆత్మహత్య శరణ్యమంటూ ఇల్లు వదిలి వెళ్లిన భర్తకు నచ్చచెప్పిన భార్య బుధవారం రాత్రి గుంటూరు అర్బన్‌ ఎస్పీ అమ్మిరెడ్డికి ఫిర్యాదు చేశారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం..గుంటూరుకు చెందిన ఒక ప్రైవేటు ఉపాధ్యాయుడు కరోనా సమయంలో ఆర్థిక ఇబ్బందుల్లో ఒక యాప్‌లో రూ.5 వేల రుణం తీసుకున్నారు. వాటిని చెల్లించడానికి మరో యాప్‌లో అలా సుమారు 10 యాప్‌లలో రూ.60 వేల వరకు తీసుకున్నారు. రూ.3 లక్షల వరకు చెల్లించానని, ఇంకా రూ.4.50 లక్షలు కట్టాలంటూ వేధిస్తున్నారని వాపోయారు. ఒకరోజు ఆలస్యమైతే అధిక వడ్డీలు వేయడంతో వాటిని వెంటనే చెల్లించకపోతే, తమ కాల్‌డేటాలోని వ్యక్తులకు మీ స్నేహితుడు దొంగ, మోసగాడంటూ మెసేజ్‌లు పెట్టడం, ఫోన్‌లు చేసి అసభ్యంగా, బెదిరింపు దోరణిలో మాట్లాడుతున్నాడని ఆవేదన చెందారు. వారి వేధింపులు భరించలేక పది రోజుల కిందట ఇల్లు వదిలి వేరే ప్రాంతానికి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. తమకు ఆత్మహత్యే శరణ్యమని, వారిపై చర్యలు తీసుకోవాలని ఏస్పీకి ఫిర్యాదు చేశారు. పల్నాడు ప్రాంతానికి చెందిన ఓ యువకుడు గుంటూరులోని వసతిగృహంలో ఉంటూ చదువుకుంటున్నాడు. కరోనా సమయంలో అనారోగ్యానికి గురవ్వడంతో మనీ యాప్‌ల ద్వారా రూ.60 వేల వరకు తీసుకొని రూ.లక్ష చెల్లించానని, మరో రూ.5 వేలు మాత్రమే చెల్లించాల్సి ఉండగా, ఒకరోజు ఆలస్యమైందంటూ ఆయా యాప్‌లు అధిక వడ్డీలు వేసి వెంటనే చెల్లించాలని బెదిరిస్తున్నారని వాపోయారు. తమ కాల్‌డేటా తీసుకొని వారికి తాను 420 అని, స్నేహితులు, బంధువుల పేర్లు చెప్పి రుణం తీసుకున్నాడంటూ సందేశాలు పెట్టి పరువు తీస్తున్నారని వాపోయాడు. రోజుకు 50 ఫోన్‌లు చేసి బెదిరిస్తున్నారని, తమకు న్యాయం చేయాలని వేడుకున్నాడు. కేసులు నమోదు చేసి దర్యాప్తు చేయాలని ఎస్పీ అధికారులను ఆదేశించారు.

Post a Comment

Previous Post Next Post