చిత్రం: రాంగోపాల్ వర్మ 'మర్డర్'నటీనటులు: శ్రీకాంత్ అయ్యంగార్,గాయత్రీ భార్గవి,సాహితీ, గిరిధర్,దీపక్, గణేష్ఛా ,యాగ్రహణం: జగదీష్ చీకటి-సంగీతం: డి ఎస్ ఆర్-కూర్పు: శ్రీకాంత్ పట్నాయక్.ఆర్-నిర్మాతలు: నట్టి కరుణ, నట్టి క్రాంతి-స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: ఆనంద్ చంద్రవి -డుదల: 24-12-2020
రాంగోపాల్ వర్మ వెండితెరపై హిట్టు మాట వినిపించి చాలా కాలమే అయిపోయింది. కానీ, ఇప్పటికీ వర్మ సినిమా వస్తుందంటే.. ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూడటానికి కారణం ఆయన ఎంచుకునే వివాదాస్పద కథాంశాలే. సినిమా ప్రారంభిస్తూనే వివాదాల అగ్గి రాజేయడం.. దానిపై వచ్చే విమర్శల్నే ప్రచార అస్త్రాలుగా మార్చుకొని తనదైన శైలిలో సినిమాకు క్రేజ్ తీసుకురావడం వర్మ ఎత్తుగడగా మారిపోయింది. ‘మర్డర్’ చిత్రంతో ఆయన మరోసారి అదే పంథాలో నడిచారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఒక పరువు హత్య స్ఫూర్తితో కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించి అందరి దృష్టినీ ఆకర్షించారు. ఈ చిత్రం తాజాగా థియేటర్లలో విడుదలైంది. మరి ఈ చిత్రంతో ఆయన ఈసారి ఏం చూపించారు? అందరూ అనుకుంటున్నట్లు మిర్యాలగూడ పరువు హత్యకి.. ఈ కథకీ సంబంధం ఉందా? ఈ సినిమాతోనైనా ఆయన హిట్టు మాట వినిపించారా?
ఎలా ఉందంటే: కథ.. నటీనటుల పేర్లు.. వారి వేషధారణ చూడగానే ఇది మిర్యాలగూడ పరువు హత్యకు సంబంధించిన కథే అని అనిపిస్తుంది. ‘కానీ, యాదృశ్చికంగా అందరికీ అలా అనిపిస్తే అది తమ తప్పు కాదని, ఇది ఎవరినీ ఉద్దేశించి తీసిన చిత్రం కాద’ని ఇప్పటికే స్పష్టత ఇచ్చేసింది చిత్ర బృందం. పరువు హత్యల కోణంలో ఇప్పటి వరకు చాలా కథలు వచ్చాయి. కానీ, మర్డర్ చిత్రంతో ఓ తండ్రి కోణంలో పరువు హత్యకు దారితీసిన పరిస్థితుల్ని ఆవిష్కరించే ప్రయత్నం చేసింది చిత్ర బృందం. బలమైన భావోద్వేగాలతో నిండిన కథ ఇది. తొలి భాగంలో ప్రేమ విషయంలో త్రండ్రీ కూతుర్ల మధ్య నడిచే పోరును, అల్లారు ముద్దుగా పెంచుకున్న బిడ్డ తమని కాదని వెళ్లిపోతే తల్లిదండ్రుల పడే వేదనను ఆవిష్కరించే ప్రయత్నం చేశారు.
ద్వితీయార్ధంలో కూతుర్ని కాపాడుకోవడం కోసం ఓ తండ్రి హంతకుడిగా ఎలా మారాడన్నది భావోద్వేగభరితంగా చూపించారు. ప్రధమార్ధంలో ప్రేమ విషయమై తండ్రీ, కూతుర్ల మధ్య జరిగే సంభాషణల్ని ఎంతో వాస్తవికంగా చూపించే ప్రయత్నం చేశారు దర్శకుడు. కానీ, కథలో సన్నివేశాలన్నీ పూర్తిగా మాధవరావు పాత్రకు అనువుగా సాగుతుండటంతో అక్కడక్కడా కథలో బిగి సడలినట్లు అనిపిస్తుంటుంది. ఇక ద్వితీయార్ధానికి వచ్చేసరికి కథ ఎక్కువగా మాధవరావు పాత్ర చుట్టూనే తిరుగుతుండటం, చాలా చోట్ల సన్నివేశాలు మరీ నత్తనడకన నడిచినట్లు అనిపించడంతో ఏదో సీరియల్ చూస్తున్న అనుభూతి కలుగుతుంది. ప్రవీణ్ హత్యకు మాధవరావు ప్రణాళిక రచించినప్పటి నుంచీ వచ్చే సన్నివేశాలన్నీ ఉద్వేగభరితంగా, ప్రేక్షకులను చూపు తిప్పుకోనివ్వకుండా చేస్తాయి. సినిమాకి ప్రధాన ఆయువు పట్టు ఈ ఎపిసోడే. ముఖ్యంగా ప్రవీణ్ హత్య సమయంలో వచ్చే నేపథ్య సంగీతం ఒళ్లు జలదరించేలా చేస్తుంది. ముగింపులో ఈ బిగి మళ్లీ సడలినట్లు అనిపిస్తుంది. కానీ, ఇది ఓ యథార్థ సంఘటన స్ఫూర్తితో అల్లుకున్న కథ కాబట్టి ఆ ముగింపును ప్రేక్షకులు ఒప్పుకోక తప్పదు.
ఎవరెలా చేశారంటే: మాధవరావు పాత్రలో శ్రీకాంత్ అయ్యంగార్ నటన, ఆయన వేషధారణ మెప్పిస్తుంది. కూతుర్ని ప్రేమించిన వాడు చెడ్డవాడని తెలిసీ, ఆ విషయాన్ని ఆమెకు ఎలా అర్థమయ్యేలా చెప్పాలో తెలియక తనలో తానే కుమిలిపోయే తండ్రిగా ఆయన నటన కట్టిపడేస్తుంది. అలాగే ద్వితీయార్ధంలో ఆయనలోని ప్రతినాయక ఛాయలన్నీ ఎంతో అద్భుతంగా ఆవిష్కరించారు. ఇక ప్రవీణ్ ప్రేమలో పడి, తల్లిదండ్రులకు ఎదురు తిరిగే కూతురు నమ్రత పాత్రలో సాహితి ఒదిగిపోయింది. తెరకు కొత్తగా పరిచయమైన అమ్మాయిలా ఉన్నా.. చాలా సన్నివేశాల్లో శ్రీకాంత్‌తో పోటాపోటీగా మెప్పిస్తుంది. గాయత్రి భార్గవి తన పాత్రకు ఉన్న పరిధిలో భావోద్వేగభరితంగా నటించింది. ప్రవీణ్ పాత్ర పోషించిన నటుడికి రెండు మూడు సన్నివేశాల్లో కనిపించడం మినహా ఎక్కడా నటించే అవకాశమే రాలేదు.
ఇక టేకింగ్ స్టైల్‌లో దర్శకుడు ఆనంద్ చంద్ర.. వర్మను యథావిథిగా ఫాలో అయిపోయాడనిపిస్తుంది. కథ మొత్తం ఒక దగ్గరే.. రెండు పాత్రల చుట్టూనే తిరుగుతుండటంతో బోర్‌గా అనిపిస్తుంటుంది. ఇది తక్కువ బడ్జెట్‌తో రూపొందించిన చిత్రమే అయినా.. నిర్మాత పెట్టిన ప్రతి రూపాయికీ తన ఛాయాగ్రహణంతో నూటికి నూరు శాతం నాయ్యం చేసే ప్రయత్నం చేశారు జగదీష్ చీకటి. ఆయన ఛాయాగ్రహణం, డీఎస్‌ఆర్ సంగీతం సినిమాకు కావాల్సినంత బలాన్ని చేకూర్చాయి. నిడివి పరంగా చూసుకున్నప్పుడు ఇది థియేటర్లు లక్ష్యంగా తెరకెక్కించిన చిత్రం కాదనిపిస్తుంది.