భువనేశ్వర్/పూరీ : జగతినాథుని దర్శనం కోసం భక్తజనం తహతహలాడుతోంది. ఈనెల 23 నుంచి అంచెలంచెలుగా దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా జగన్నాథుని సేవాయత్ వర్గాలకు తొలి దర్శనం అవకాశం కల్పించారు. కట్టుదిట్టమైన తనిఖీలతో స్వామివారి దర్శనం కోసం శ్రీమందిరం లోపలికి భక్తుల్ని అనుమతిస్తున్న తరుణంలో లొంగులి బాబా అకస్మాతుగా దూసుకుపోయిన సంఘటన తీవ్ర సంచలనం రేపింది. స్థానిక లొంగులి మఠంలో బస చేస్తున్న బాబా వైష్ణవ్పురి జగన్నాథుని దర్శనం కోసం బయలుదేరాడు.
సింహద్వారం వద్ద భద్రత సిబ్బంది గుర్తింపు కార్డు కోసం నిలదీశారు. అయితే ఆవరణలో ఉన్న పతిత పావనుని విగ్రహాన్ని దర్శిస్తూ.. కాసేపటికే అకస్మాతుగా చేతిలో ఢమరకం మోగించుకుని సింహద్వారం ఆవరణలో భద్రతా సిబ్బంది వలయం ఛేదించుకుని చొరబడ్డాడు. 22 మెట్లు గుండా శ్రీమందిరం గర్భాలయానికి పరుగులు తీశాడు. బాబా వెంట ఆలయం భద్రత దళం జవాన్లు పరుగులు తీసిన బాబా.. స్వామి సన్నిధికి సునాయాశంగా చేరుకున్నాడు. స్వామి దర్శనంతో తన్మయం చెందుతున్న తరుణంలో జవాన్లు అదుపులోకి తీసుకుని బయటకు తరలించారు. ఇతర సేవాయత్ల తరహాలో స్వామి సేవకులుగా తమకు గుర్తింపు జారీ అయినా.. దేవస్థానం పాలక యంత్రాంగం ఈ మేరకు మంజూరు చేయక పోవడంతో తమవర్గం స్వామి సేవలకు దూరం అవుతుందని వాపోయాడు. స్వామి కనులలో కనులు కలిపి దర్శించాలనే తపనతో శ్రీమందిరం లోపలికి చొరబడి మనసారా స్వామిని దర్శించుకున్నట్లు తెలిపాడు.